కొన్నిసార్లు నింద‌లు ప‌డాల్సి ఉంటుందిః యాంక‌ర్ భ‌ర్త‌

చీటింగ్ కేసులో అరెస్ట్ అయి, బెయిల్‌పై విడుద‌లైన ప్ర‌ముఖ యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త ల‌క్ష్మీన‌ర‌సింహారెడ్డి మీడియా ముందు కొచ్చారు. నిజానిజాలేంటో ఆధారాల‌తో స‌హా రెండు రోజుల్లో చెబుతాన‌న్నారు. అప్పుడు వాస్త‌వాలేంటో ఎవ‌రికి వారు నిర్ణ‌యించు…

చీటింగ్ కేసులో అరెస్ట్ అయి, బెయిల్‌పై విడుద‌లైన ప్ర‌ముఖ యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త ల‌క్ష్మీన‌ర‌సింహారెడ్డి మీడియా ముందు కొచ్చారు. నిజానిజాలేంటో ఆధారాల‌తో స‌హా రెండు రోజుల్లో చెబుతాన‌న్నారు. అప్పుడు వాస్త‌వాలేంటో ఎవ‌రికి వారు నిర్ణ‌యించు కోవ‌చ్చ‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు.

ఇటీవ‌ల ఖాజాగూడ‌కు చెందిన సింధూరారెడ్డి త‌న వ‌ద్ద రూ.85 ల‌క్ష‌లు తీసుకుని, తిరిగి ఇవ్వ‌లేద‌ని పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. దీంతో శ్యామ‌ల భ‌ర్త‌పై కేసు న‌మోదు చేయ‌డంతో పాటు అరెస్ట్ చేశారు. లక్ష్మీ నరసింహారెడ్డితోపాటు ఆయనకు అండ‌గా నిలిచిన‌ జయంతి గౌడ్‌ అనే మహిళను సైతం అరెస్టు చేయ‌డం చ‌ర్చ‌కు దారి తీసింది. 

గండిపేట‌లో రూ.100 కోట్లు విలువైన నాలుగు ఎక‌రాల్లో ఈత‌కొల‌ను, ప‌డ్‌, గేమ్ జోన్ త‌దిత‌ర అభివృద్ధి ప‌నులు చేసేందుకు పెట్టుబ‌డి పెట్టాల‌ని ప్ర‌తిపాదిస్తూ త‌న వ‌ద్ద భారీ మొత్తంలో డ‌బ్బు తీసుకున్నాడ‌ని బాధిత మ‌హిళ ప్రధాన ఫిర్యాదు.

అరెస్ట్ నేప‌థ్యంలో త‌న‌పై వ‌చ్చిన ఆరోప‌ణ‌ల‌పై వివ‌ర‌ణ ఇచ్చేందుకు శ్యామ‌ల భ‌ర్త‌, బుల్లితెర న‌టుడైన ల‌క్ష్మీన‌ర‌సింహారెడ్డి ఓ వీడియో చేశారు. దాన్ని శ్యామ‌ల త‌న ఇన్‌స్టా వేదిక‌గా షేర్ చేశారు. ఆ వీడియోలో ఏమ‌న్నారంటే…

‘ గత రెండు రోజులుగా సోషల్‌మీడియాలో నా గురించి వస్తోన్న కథనాలకు సంబంధించిన అన్ని నిజా నిజాలను మీతో పంచుకోవడానికి మరికొన్ని రోజుల్లో మీ ముందుకు వస్తాను. కేసు ఏమిటి? అందులోని నిజానిజాలేమిటి? ఇలా అన్నిరకాల ఆధారాలతో మిమ్మల్ని కలుస్తాను. అప్పుడు మీకే ఓ అంచనా వస్తుంది. 

న్యాయం, న్యాయస్థానంపై నాకు పూర్తి నమ్మకం ఉంది. ఇది తప్పుడు కేసు అనడానికి నిద‌ర్శ‌నం నేను కేవ‌లం రెండు రోజుల్లోనే మీ ముందుకు రావడం. కొన్నిసార్లు ఇలాంటి నిందలు పడాల్సి ఉంటుంది. కానీ, వచ్చిన పుకార్లపై తప్పకుండా స్పందించాల్సిన అవసరం ఉంది’ అని లక్ష్మీనరసింహారెడ్డి తెలిపారు.

ల‌క్ష్మీన‌ర‌సింహారెడ్డి ఎలాంటి ఆధారాల‌తో ముందుకొస్తార‌నే దానిపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కుంది. బుల్లితెర ప్ర‌ముఖ యాంక‌ర్ శ్యామ‌ల భ‌ర్త కావ‌డంతో ఆయ‌న అరెస్ట్ స‌హ‌జంగానే చ‌ర్చ‌కు దారి తీసింది.