యధార్థవాది లోకవిరోధి అంటారు. నిజాలెప్పుడూ నిష్టూరంగానే ఉంటాయి. అబద్ధాలు తీయగా ఉంటాయి. నిజాలు మాట్లాడ్డానికి చాలా ధైర్యం కావాలి. ఎందుకంటే వాస్తవాల్ని అంత సులభంగా జీర్ణించుకోలేరు.
కరోనా విపత్కర పరిస్థితుల్లో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాటలు ఒక్కోసారి సొంత పార్టీ వాళ్లకే నచ్చడం లేదు. ఇక ప్రత్యర్థుల గురించి ప్రత్యేకంగా చెప్పేదేముంటుంది. నిజాలు చెప్పడం వల్ల సమాజంతో పాటు ప్రత్యర్థుల నుంచి వచ్చే రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియడం వల్లే వైసీపీ నేతలు ఆందోళన చెందుతుంటారు.
ప్రస్తుతానికి వస్తే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి నిజాలు చెప్పి తన నైజాన్ని చాటుకున్నారు. గతంలో కరోనాతో సహ జీవనం చేయాల్సిందేనని కుండబద్దలు కొట్టినట్టు చెప్పి, అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఈ మాటలతో జగన్ తమ చేతికి చిక్కాడని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ సంబరాలు చేసుకునే లోపే …మోడీ, కేసీఆర్‌లతో పాటు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా అదే పల్లవి అందుకున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా అదే మాట చెప్పాల్సి వచ్చింది. దీంతో జగన్‌ను విమర్శించిన చంద్రబాబు, లోకేశ్ తదితర టీడీపీ నేతలంతా నాలుక్కరుచు కోవాల్సి వచ్చింది.
కరోనా సెకెండ్ వేవ్ రోజురోజుకూ ఉధృతమవుతున్న విపత్కర పరిస్థితుల్లో జగన్ సాహసోపేతమైన వ్యాఖ్యలు చేశారు. అవేంటో తెలుసకుందాం.
‘దేశంలో 18 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సినేషన్ పూర్తి కావాలంటే వచ్చే ఏడాది జనవరి చివరికి సాధ్యమవుతుంది. కరోనాకు టీకాలు వేయడమే పరిష్కారంగా ఉంది. వచ్చే ఫిబ్రవరి వరకూ అందరం జాగ్రత్తగా ఉండాల్సిందే’ అని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. అలాగే దేశంలో 45 ఏళ్లు దాటిన వారందరికీ వ్యాక్సిన్ ఇవ్వాలంటే ఇంకా నాలుగైదు నెలలు పడుతుందన్నారు.
దేశంలో 18 ఏళ్లు దాటిన వారు 60 కోట్ల మంది ఉన్నారన్నారు. వారికి 120 కోట్ల డోసులు కావాల్సి ఉంటుందని జగన్ చెప్పు కొచ్చారు. సెప్టెంబరు తర్వాతే వారికి వ్యాక్సినేషన్ ఇవ్వడం సాధ్యమన్నారు. ఈ లెక్కన దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ మొత్తం పూర్తికావాలంటే జనవరి నెలాఖరు అవుతుందని జగన్ తేల్చి చెప్పారు. అందుకే వచ్చే సంవత్సరం ఫిబ్రవరి వరకూ మనమంతా జాగ్రత్తగా ఉండాలని జగన్ హెచ్చరించడం గమనార్హం.
జగన్ మాటలు రుచించకపోవచ్చు. ఫిబ్రవరి వరూ జాగ్రత్తగా ఉండాలనే మాటలు మనసును కష్టపెట్టొచ్చు. కానీ ప్రాణాలు కాపాడుకోవాలంటే వాస్తవాల్ని గ్రహించి , అందుకు తగ్గట్టు జీవితాల్ని మలుచుకోవాల్సిందే. ఎందుకంటే కరోనా సెకెండ్ వేవ్ మే నెలాఖరుకు తీవ్రస్థాయికి చేరుకుని, ఆ తర్వాత తగ్గుముఖం పడుతుందని నిపుణులు చెబుతూ వస్తున్నారు.
అలాగే 18 ఏళ్లకు పైబడిన వారంతా వ్యాక్సినేషన్ కోసం ఆన్‌లైన్‌లో రిజిస్ట్రే షన్ చేయించుకునే అవకాశం ఇవ్వడంతో, త్వరలో ఆ తంతు కూడా పూర్తి అవుతుందని అందరూ భావిస్తున్నారు. ఈ తరుణంలో జగన్ పిడుగులాంటి వ్యాఖ్యలు అందరినీ అప్రమత్తం చేశాయి.
జగన్‌ను వ్యతిరేకించే స్వేచ్ఛ ప్రతి ఒక్కరికీ ఉంటుంది. కానీ ఆయన చెప్పిన నిజాలను కాదనలేని పరిస్థితి. జగన్ మాటలు మొదట్లో వ్యతిరేకంగా కనిపిస్తున్నా, ఆ తర్వాత అవి ఎలా నిజమవుతూ వచ్చాయో గతానుభవాలు చాటి చెప్పాయి.
సొదుం రమణ