కరోనా సెకెండ్ వేవ్ ఉధృతమవుతూ, ప్రజల ప్రాణాలను తీస్తూ తీరని శోకాన్ని మహమ్మారి మిగుల్చుతోంది. మరోవైపు రోగులను ప్రైవేట్, కార్పొరేట్ వైద్యశాలలు పీల్చి పిప్పి చేస్తున్నాయి. మహమ్మారితో పాటు ప్రజానీకంపై కార్పొరేట్ వైద్యం పంజా విసురుతున్న ప్రమాదకర పరిస్థితుల్లో పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి.
దీంతో జగన్ ప్రభుత్వం అప్రమత్తమైంది. కలెక్టర్లు, విజిలెన్స్ అధికారులు దాడులను ముమ్మరం చేశారు. రోగుల ఫిర్యాదుల మేరకు కొన్ని ఆస్పత్రులపై భారీ జరిమానాలు విధిస్తూ … దందాలకు పాల్పడే వాళ్లకు ఓ హెచ్చరిక పంపారు. ఈ నేపథ్యంలో సీఎం సొంత జిల్లా కడపలో ఆరు ప్రైవేట్ కోవిడ్ ఆస్పత్రులు తాము వైద్యం చేయలేమని ఏకంగా బోర్డులు పెట్టాయి.
ఇదిలా ఉండగా ఏపీ ప్రభుత్వానికి ఏ మాత్రం సంబంధం లేని వాటిని కూడా సీఎం జగన్ మెడకు చుట్టి విమర్శలు చేసే ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కార్పొరేట్ వైద్యం దందాపై తన వైఖరేంటే ఇంత వరకూ చెప్పలేదు.
ప్రైవేట్, కార్పొరేట్ వైద్యశాలలపై ప్రభుత్వ దాడులను టీడీపీ సమర్థిస్తోందా? లేక వ్యతిరేకిస్తోందా? అనేది స్పష్టం చేయాల్సి వుంది. టీడీపీ మౌనాన్ని ఎలా అర్థం చేసుకోవాలి. ఒకవేళ టీడీపీ సమర్థిస్తుంటే, కోవిడ్ ట్రీట్‌మెంట్ సాకుతో ప్రజానీకాన్ని జలగల్లా పీల్చి పిప్పి చేస్తున్న ప్రైవేట్ దందాపై ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోవచ్చో ప్రభుత్వానికి ప్రధాన ప్రతిపక్షంగా సూచనలు, సలహాలు ఇవ్వాలి.
అలా కాకుండా ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రులపై దాడులు చేయడం వల్ల వాటి వ్యతిరేకతను వైసీపీ మూటగట్టుకుంటుందని, తద్వారా తాము వాటి నుంచి ఆర్థికంగా లాభపడొచ్చని టీడీపీ భావిస్తే సమాజం ఎంత మాత్రం క్షమించదని గ్రహించాలి. ఇప్పటికే ప్రైవేట్ దందాకు టీడీపీ వత్తాసు పలుకుతోందనే అభిప్రాయాలు బలపడుతున్నాయి. ఇదే నిజమైతే టీడీపీది సరైన వైఖరి కాదు.
టీడీపీ మౌనం కార్పొరేట్ గద్దలకు వత్తాసు పలకడమే అని జనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కావున ఇప్పటికైనా వైద్య రంగంలో కార్పొరేట్ దందాపై చంద్రబాబు, లోకేశ్ నోరు తెరవాలి.
తమకు నచ్చిన వాటిపై అనవసరం రాద్ధాంతం చేయడం కాదు, ఇప్పుడు ప్రధానంగా వైద్య ఖర్చులకే జనం బెంబేలెత్తుతున్నారు. నిజంగా చంద్రబాబు, లోకేశ్‌కు దమ్ము, ధైర్యం ఉంటే …ప్రైవేట్ వైద్యం దోపిడీపై పోరాటం చేయాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.
సొదుం రమణ