సినిమా రివ్యూ: హిట్

సమీక్ష: హిట్  ది ఫస్ట్ కేస్ రేటింగ్: 2.75/5 బ్యానర్: వాల్‌పోస్టర్ సినిమా తారాగణం: విశ్వక్ సేన్, రుహాని శర్మ, మురళి శర్మ తదితరులు కూర్పు: గ్యారీ బి.హెచ్. సంగీతం: వివేక్ సాగర్ ఛాయాగ్రహణం:…

సమీక్ష: హిట్  ది ఫస్ట్ కేస్
రేటింగ్: 2.75/5
బ్యానర్:
వాల్‌పోస్టర్ సినిమా
తారాగణం: విశ్వక్ సేన్, రుహాని శర్మ, మురళి శర్మ తదితరులు
కూర్పు: గ్యారీ బి.హెచ్.
సంగీతం: వివేక్ సాగర్
ఛాయాగ్రహణం: ఎస్. మణికండన్
సమర్పణ: నాని
నిర్మాత: ప్రశాంతి తిపిర్నేని
రచన, దర్శకత్వం: శైలేష్ కొలను
విడుదల తేదీ: ఫిబ్రవరి 2, 2020

నాని నిర్మాత అంటే స్పెషల్‌గా వుంటుందనే పాయింట్‌ని ముందుగా ‘చెక్’ చేసి పెట్టింది ‘హిట్’. ఇది రెగ్యులర్ సినిమాల మధ్య ఖచ్చితంగా స్పెషల్‌గానే అనిపిస్తుందనడంలో నో డౌట్. ఔటర్ రింగ్ రోడ్‌లో కనిపించకుండా పోయిన ఒక టీనేజ్ అమ్మాయి, ఆ కేస్‌కి లింక్ అవుతూ మిస్ అయిన ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ అయిన మరో యువతి… ఆడియన్స్‌ని ఇన్‌స్టంట్‌గా ఎంగేజ్ చేయడానికి పర్‌ఫెక్ట్ సెటప్. ఈ కేసుని సాల్వ్ చేసే బాధ్యత తీసుకున్న ‘హిట్’ ఆఫీసర్. అతనికి పానిక్ ఎటాక్స్ ఇచ్చే ఒక భయంకరమయిన పాస్ట్. మిస్ అయిన ఫోరెన్సిక్ ఎక్స్‌పర్ట్ అతనికి గాళ్‌ఫ్రెండ్.

యువ దర్శకుడు శైలేష్ కొలను రాసుకున్న కథలో వీక్షకులని హుక్ చేసే ఎలిమెంట్స్ అన్నీ చక్కగా కుదిరాయి. ఇక కథానాయకుడితో ట్రావెల్ చేస్తూ, అతను కనుగొంటోన్న ఆధారాల ద్వారా ప్రేక్షకులు కూడా ‘ఏం జరిగి వుంటుందనే’ గెస్ చేస్తూ ఇన్‌వాల్వ్ అవడానికి మొదట్లో వచ్చే సన్నివేశాలు, ఒక్కొక్కటిగా ఎంటర్ అయ్యే పాత్రలు దోహదపడతాయి. అయితే ఏ క్లూ పట్టుకున్నా అదో డెడ్ ఎండ్ వైపు దారి తీస్తుంటుంది. మొదట్లో అదంతా ఎంగేజింగ్‌గా అనిపించినా కానీ తర్వాత ఏ పాయింట్‌ని దర్శకుడు స్ట్రెస్ చేస్తున్నా, ఎవరివైపుకి అనుమానాలు వెళ్లాలని డ్రైవ్ చేస్తున్నా ‘ఇది కాదు. జస్ట్ మిస్ లీడింగ్’ అనే ఫీలింగ్ వచ్చేస్తుంటుంది.

ఉదాహరణకి పబ్‌లో ఒక బార్‌టెండర్ పోలీస్‌ని చూడగానే పరుగు అందుకోగానే, అతను ఎందుకు పరుగెత్తాడు, అతను ఏ తప్పు చేసాడు అనేది ఈజీగా మైండ్‌లోకి వస్తుంది. అంతెందుకు అవుటర్ రింగ్ రోడ్‌లో కార్ ఎలా కెమెరాలకి దొరకకుండా మిస్ అవుతుందనేది ఈ కథకి సంబంధించి కీలకమైన సీక్రెట్. అది ఏమై వుంటుందనేది మొదట చూపించిన సిసి కెమెరా ఫుటేజ్ నుంచే గెస్ చేయవచ్చు. అలాగే అనుమానం కలిగించడానికే తెరపైకి వచ్చే పాత్రల్లో దేనికీ తగిన మోటివ్ కనిపించదు. ముఖ్యంగా ఏ క్యారెక్టర్ కూడా ఇంత క్రైమ్ చేయడానికి క్యాపబుల్ అనిపించదు. సస్పెన్స్‌ని చివరి వరకు మెయింటైన్ చేయడంలో దర్శకుడు సఫలమయినా కానీ సర్‌ప్రైజ్‌లు ఇవ్వడంలో కానీ, ఎక్కడా ఉత్కంఠ రేకెత్తించడంలో కానీ స‌క్సెస్ కాలేదు.

హిట్ ఇన్వెస్టిగేషన్ డ్రామా అంతటిలో ప్రేక్షకులని కూర్చోపెట్టే ఏకైక ఎలిమెంట్ ఆ అమ్మాయిని ఎవరు కిడ్నాప్ చేసి వుంటారు? అసలెందుకు చంపి వుంటారు? అనేది. ఆ విషయం ఏమిటనేది తెలిసినపుడు షాకింగ్‌గా అనిపించాలి. ముఖ్యంగా ఎవరయితే ఆ దారుణానికి పాల్పడ్డారో వారి పాత్ర అనూహ్యమైన అనుభూతికి లోను చేయాలి. దేనికోసమయితే అంతవరకు వేచి చూస్తామో అదే విషయం చాలా నిరాశ పరుస్తుంది. పలు చిత్రాల్లో వాడేసిన మోటివ్‌నే చూపించడం ఒకటయితే, సదరు క్రిమినల్‌ని పూర్తిగా కనిపించకుండా వుంచడం, వాళ్లు ఆ క్రైమ్‌ని ఎగ్జిక్యూట్ చేసిన విధానం ఎంత మాత్రం ఎక్సయిట్ చేయకపోగా, లాజిక్‌కి చాలా దూరంగా వుంటుంది.

హీరో పాత్రకి పెట్టిన ఆ పానిక్ ఎటాక్స్, ఆ డిస్టర్బింగ్ పాస్ట్ క్యారెక్టరైజేషన్‌కి ఒక డైమెన్షన్ ఇవ్వడానికి మినహా కథకి ఏమీ యాడ్ చేయలేదు. అలాగే హీరోయిన్ పాత్ర ద్వారా యాడ్ చేసిన రొమాన్స్ ఎలిమెంట్ వల్ల ఎమోషనల్ కనక్ట్ కూడా ఏర్పడలేదు. మిస్ అయిన వారిలో ఇద్దరికీ ఏమైనా జరిగిందా, ఒకవేళ ఒకరికే ఏదైనా అయి వుంటే అది ఎవరికి అయి వుంటుందనే గెస్సింగ్ పార్ట్‌కి మినహా రుహాని శర్మ క్యారెక్టర్ వల్ల కథాపరంగా యాడ్ అయ్యే ఎక్స్‌ట్రా సస్పెన్స్ ఏముండదు. విశ్వక్ సేన్‌కి వున్న ఆఫ్ స్క్రీన్ ఇమేజ్‌కి, అతనికి వున్న యూత్ ఫాలోయింగ్‌కి అనుగుణంగా పాత్రచిత్రణ జరిగింది. తన పాత్రకి విశ్వక్ న్యాయం చేసాడు. మిగిలిన పాత్రల్లో కొంచెం ఆసక్తి కలిగించేది హరితేజ చేసిన డైవోర్సీ క్యారెక్టర్. అయితే ఆమెవైపుకి చాలా ఎర్లీగా చాలా విషయాలు పాయింట్ అవుట్ చేయడంతో ఆ క్యారెక్టర్ ఇన్‌వాల్వ్‌మెంట్ ఎంత అనేది గెస్ కొట్టవచ్చు. మురళిశర్మ పాత్రని ఆరంభంలో ప్రేక్షకులని ఇన్‌వాల్వ్ చేయడానికి మినహా వాడుకోలేదు.

ఈ చిత్రానికి సాంకేతికంగా సంగీతం, ఛాయాగ్రహణం, కళ, కూర్పు అన్నీ బాగా కుదిరాయి. ఈ చిత్రానికి అవసరమయిన వనరులన్నీ నాని సమకూర్చాడు. ఎక్కడా లో బడ్జెట్‌లో తీసిన భావన రాకుండా క్వాలిటీ విజువల్స్ వుండేలా చూసుకున్నారు. దర్శకుడు శైలేష్ ప్రేక్షకులని లీనం చేసే అంశాలని పెట్టుకున్నా కానీ పలు చోట్ల ఈజీ క్లూస్ ఇచ్చేయడం వల్ల ఆ సీన్స్ తాలూకు ఇంపాక్ట్ అంతగా లేదు. అలాగే ఒకటే పాయింట్‌పై నడిచే కథనం కావడంతో ఒక పాయింట్ చేరుకున్న తర్వాత కథ ముందుకి కదలడం లేదనే భావన రాకపోలేదు. ఈ కథకి కనుక లాస్ట్ యాక్ట్ బాగా రాసుకుని, ఒక షాకింగ్ అండ్ థ్రిల్లింగ్ క్లయిమాక్స్ ఇచ్చినట్టయితే డెఫినెట్‌గా టైటిల్‌కి తగ్గ సినిమా అని ఎవరయినా అనేస్తారు.

నాని ఫ్యాక్టర్, విశ్వక్ సేన్‌కి కుర్రాళ్లలో వున్న క్రేజ్ ఈ చిత్రానికి బాక్సాఫీస్ పరంగా హెల్ప్ అవ్వవచ్చు కానీ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ పరంగా శాటిస్‌ఫాక్టరీ ఫీలింగ్‌తో బయటకి వచ్చే వాళ్లు ఎక్కువ మంది వుండకపోవచ్చు. సస్పెన్స్ ఎలిమెంట్ కారణంగా ఎంగేజ్ చేయగలిగిన ఈ చిత్రం టార్గెట్‌ని హిట్ చేయాల్సిన తరుణంలో మిస్ అవడంతో ఓవరాల్‌గా యావరేజ్ ఫీల్‌ని దాటి ముందుకెళ్లదు.

బాటమ్ లైన్: టార్గెట్ మిస్!

గణేష్ రావూరి