నితిన్ నటించిన భీష్మ చిత్రం గత శుక్రవారం విడుదలైంది. మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. నితిన్ చేసిన చిత్రాల్లో చాలా మంచి చిత్రాల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. మంచి కలెక్షన్లతో ప్రదర్శితం అవుతోంది. అయితే రోజుల వ్యవధిలోనే పైరసీ భూతం బారిన పడడం విశేషం. పైరసీ అంటే ఏదో దొంగచాటుగా ఇంట్లో కూర్చుని చూసుకోవడం కాదు.. ఏకంగా ఆర్టీసీ బస్సులోనే పబ్లిక్ ప్రదర్శన లాగా నాలుగోరోజునే భీష్మ సినిమా ప్రదర్శించేయడం అంటే.. ఎంతాశ్చర్యం. ఇలాగైతే అసలు ఇండస్ట్రీ మనగలగడం ఎలాగ?
సినిమాలు పైరసీ భూతాన్ని ఎదుర్కోవడం అనేది ఇవాళ్టి సమస్య కాదు. గతంలో అనేక పెద్దపెద్ద భారీ బడ్జెట్ చిత్రాలకు కూడా పైరసీ దెబ్బ తప్పలేదు. పైరసీని అడ్డుకోవడానికి రకరకాల సాంకేతిక పద్ధతులు అనుసరించడం.. ఏ థియేటర్లో పైరసీ చేశారో కనిపెట్టేలా టెక్నాలజీలో ఏర్పాట్లూ.. వాటర్ మార్క్ వంటి వ్యవహారాలూ… పరిశ్రమ పరంగా ఎన్ని ప్రయత్నాలు చేయవచ్చో అన్నీ చేశారు. కానీ పైరసీని అడ్డుకోలేకపోయారు. పైరసీలు చేసే, విక్రయించే దుకాణాలపై సినీహీరోలు తమ మందీ మార్బలాన్ని వేసుకుని దాడులుచేయడమూ.. పైరసీని అడ్డుకోవడానికి సహకరించాలంటూ.. ప్రజలకు బహిరంగ విజ్ఞప్తులు చేయడమూ కూడా చాలా సార్లు జరిగింది.
అయితే తాజాగా బయటపడిన పైరసీ వ్యవహారం ఇంకా భిన్నమైనది. నితిన్ – రష్మిక మందన్నా కాంబినేషన్లో వచ్చిన భీష్మ చిత్రం విడుదలైన నాలుగో రోజునే పైరసీ వచ్చేసింది. నిజానికి అది కూడా తెలంగాణ ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సులో వేసేశారు. ప్రయాణికుల్లో ఒకరు దానిని వీడియో తీసి.. సినిమా టీమ్ కు పంపడంతో వ్యవహారం బయటికొచ్చింది.
హీరో నితిన్ దీనిపై ఫిలిం చాంబర్ కు ఫిర్యాదు చేశారు. వారు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదుచేసి ఈ పైరసీ సోషల్ మీడియాలో విస్తరించకుండా చూడాలని కోరారు. ఈ విషయాన్ని భీష్మ దర్శకుడు వెంకీ కుడుముల కేటీఆర్ కు ట్విటర్ లో ఫిర్యాదు చేయడంతో ఆర్టీసీ బస్సుల్లో పైరసీ చిత్రాలు వేయకుండా చర్యలు తీసుకోవాలంటూ కేటీఆర్ రవాణా మంత్రి పువ్వాడ అజయ్ కు సూచించారు.
కానీ ఇది పరిష్కారం కాదు. ఆర్టీసీ బస్సులో బహిరంగ ప్రదర్శనకు వచ్చేంతగా.. పైరసీ సినిమా వచ్చిందంటే సైబర్ క్రైం పోలీసులు మూలాల్లోకి వెళ్లి అన్వేషించాలి. ఆ పైరసీ ఎక్కడ పుట్టిందో కనుక్కోగలగాలి. అక్కడ అడ్డుకోగలగాలి. లేకపోతే.. మంచి సినిమాలుగా గుర్తింపు పొందినవి కూడా.. వారంరోజులు కూడా సినిమా థియేటర్లలో బతకలేని దుస్థితి వస్తుంది.