ప్రజాస్వామ్యం అంటే అధికారస్వామ్యమేనని టీడీపీ అధికారంలో ఉండగా గట్టిగా చాటి చెప్పింది. ఎక్కడ చూసినా అధికారాన్ని బలంగా ఉపయోగించుకుంది. ఆఖరుకు ఏ చట్టబద్ధతా లేని జన్మభూమి కమిటీ మెంబర్లు కూడా నాడు రాజులుగా తమ సామంత రాజ్యాలను ఏలారు.
ఇవన్నీ కళ్ళకు కట్టే జనం టీడీపీని ఘోరంగా అవమానించి ఇంటికి పంపారు. ఇక విశాఖలో చంద్రబాబుని అటునుంచి అటే వెనక్కి పంపి వైసీపీ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని విజయనగరం రాజు గారు పూసపాటి అశోక్ గజపతి రాజు తెగ ఆందోళన చెందుతున్నారు. ఇదేనా పాలన, ఇదేనా ప్రభుత్వం, నియంత్రుత్వం, దుర్మార్గం అంటూ ఆయన నిప్పులు చెరుగుతున్నారు.
మూడేళ్ళ క్రితం తాను విమానయాన మంత్రిగా ఉండగానే తన పరిధిలోని పోర్టులోకి సివిల్ పోలీసులు ప్రవేశించి రన్ వే మీదనే జగన్ని అరెస్ట్ చేస్తే మంత్రిగా నాడు ఏమీ చెప్పలేకపోయారు. అది ప్రజాస్వామ్యం కాదని వారించలేకపోయారు. ఇపుడు మాత్రం సుద్దులు బాగా చెబుతున్నారని వైసీపీ నేతలు రిటార్టు ఇస్తున్నారంటే తప్పు లేదుగా.
ఇక బెయిల్ మీద వచ్చిన ఒక వ్యక్త్రి ముఖ్యమంత్రిగా రాష్ట్రాన్ని ఎలా పాలిస్తాడంటూ కొత్త డౌట్లు కూడా రాజుగారికి వస్తున్నాయి. మరి ఇవన్నీ కోర్టులకు తెలియవు అనుకోవాలా. లేక బెయిల్ హక్కుని ఇచ్చిన రాజ్యాంగం మీదనే రాజు గారికి గుస్సానా అన్నది కూడా ఇక్కడ చూడాలేమో.
ఏమైనా బెయిల్ మీద పాలించే జగన్ కి బాబుని అరెస్ట్ చేసే హక్కు లేదని కొత్త రాజ్యాంగం వినిపిస్తున్న రాజు గారు తన రాచరికం ఏనాడో ముగిసిందని ఎప్పటికి గ్రహిస్తారోనని వైసీపీ నేతలు కౌంటర్లేస్తున్నారుగా.