ఎప్పుడైతే విశాఖను ఎగ్జిక్యూటివ్ కేపిటల్ గా నిర్ణయించడాన్ని బాబు వ్యతిరేకించారో, అప్పుడే ఉత్తరాంధ్ర టీడీపీ క్యాడర్ చెల్లాచెదురైంది. టీడీపీ కార్యకర్తలు చంద్రబాబును బాహాటంగా తిట్టడం ప్రారంభించారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు చెందిన కొందరు నేతలు బహిరంగంగా బాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే, మరికొందరు దీనిపై అప్పట్లో మౌనం వహించారు. అయితే ఉత్తరాంధ్రలో టీడీపీ పరిస్థితి ఏంటనేది బాబు పర్యటన వేళ క్లియర్ గా జనాలకు అర్థమైంది.
చంద్రబాబు విశాఖ వస్తున్నారంటే ఆ 3 జిల్లాల టీడీపీ నేతలు క్యూ కడతారు. బాబుకు సాదర స్వాగతం పలుకుతారు. కానీ ఈసారి గంటా శ్రీనివాసరావు లాంటి ప్రముఖ నేతతో పాటు మరికొంతమంది నేతలు బాబును కలవలేదు. కనీసం అతడి పర్యటనలో పాలుపంచుకుంటామనే సమాచారం కూడా ఇవ్వలేదు. గంటా మాత్రమే కాదు.. గణబాబు, పల్లా శ్రీనివాసరావు లాంటి మరికొందరు నేతలు కూడా బాబు పర్యటనకు డుమ్మాకొట్టారు.
విశాఖను రాజధానిగా చేయాలని సంకల్పించిన జగన్ నిర్ణయాన్ని చంద్రబాబు వ్యతిరేకించడంతోనే ఉత్తరాంధ్రలో టీడీపీకి ఈ పరిస్థితి వచ్చింది. నిన్న గైర్హాజరైన నేతలంతా దాదాపు టీడీపీకి దూరమైనట్టే అనుకోవాలి. మరీ ముఖ్యంగా గంటా శ్రీనివాసరావు గైర్హాజరీపై చాలా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
విశాఖను పరిపాలన రాజధానిగా చేయాలంటూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని గంటా స్వాగతించారు. విశాఖను రాజధానిగా చేస్తే అభివృద్ధి వికేంద్రీకరణ జరుగుతుందన్నారు. కానీ అంతలోనే చంద్రబాబు దీనికి వ్యతిరేకంగా మాట్లాడ్డంతో గంటా సైలెంట్ అయ్యారు. నిన్న బాబు టూర్ కు గంటా హాజరుకాకపోవడానికి ఇదే కారణం అంటున్నారు చాలామంది.
ఇక్కడ గమ్మత్తైన విషయం ఏంటంటే.. జస్ట్ 10 రోజుల కిందటే కొంతమంది కార్యకర్తల్ని టీడీపీలో చేర్చుకున్నట్టు ప్రకటించుకున్నారు గంటా. దానికి సంబంధించిన ఫొటోలు కూడా పెట్టుకున్నారు. అంతేకాదు, బాబు తలపెట్టిన యాత్రను తన నియోజకవర్గంలో ప్రారంభించారు కూడా. పైకి ఇన్ని పనులు చేస్తున్నా.. లోపల మాత్రం ఆయనకు టీడీపీలో కొనసాగడం ఇష్టంలేనట్టుంది. విశాఖ ఎయిర్ పోర్ట్ లో గంటా కనిపించలేదంటే దానికి ఏదో బలమైన కారణమే ఉండి ఉంటుంది. ఇక గంటా ఎంత మాత్రం తప్పించుకు తిరగలేదు. తను ఎటువైపు ఉన్నాడో చెప్పి తీరాల్సిందే.