హైదరాబాద్ లో కాల్పులు.. జనం చూస్తుండగా పరార్

హైదరాబాద్ లో నడిరోడ్డుపై తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. జనం అంతా రోడ్లపై ఉంటుండగానే, పట్టపగలు ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఏటీఏంలో దొంగతనానికి యత్నించారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే…

హైదరాబాద్ లో నడిరోడ్డుపై తుపాకీ కాల్పుల ఘటన కలకలం రేపింది. జనం అంతా రోడ్లపై ఉంటుండగానే, పట్టపగలు ఇద్దరు దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఏటీఏంలో దొంగతనానికి యత్నించారు. ఈ ఘటనలో సెక్యూరిటీ గార్డు అక్కడికక్కడే మరణించాడు.

కూకట్ పల్లి ప్రాంతంలో జరిగింది ఈ ఘటన. ఎప్పట్లానే కూకట్ పల్లిలోని ఓ ఏటీఎంలో నగదు నింపడానికి జీపులో వచ్చారు సిబ్బంది. అందులో ముగ్గురు టెక్నీషియన్స్ తో పాటు ఓ సెక్యూరిటీ గార్డు కూడా ఉన్నాడు. 12 లక్షల రూపాయలు పట్టుకొని ఏటీఎంలోకి ఎంటరయ్యేందుకు రెడీ అయ్యారు.

సరిగ్గా అప్పుడే బైక్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాల్పులకు పాల్పడ్డారు. ముందుగా సెక్యూరిటీ గార్డుపై కాల్పులు జరిపారు. దీంతో 74 ఏళ్ల ఆ గార్డు అక్కడికక్కడే మృతిచెందాడు. సిబ్బందిలోని మరో వ్యక్తి కాలికి బలంగా గాయమైంది. వెంటనే దుండగులు చేతికి దొరికినంత నగదుతో పరారయ్యారు.

దొంగతనం చేసే క్రమంలో ఓ వ్యక్తి పెట్టుకున్న హెల్మెట్ ఊడిపోయింది. పైగా చుట్టుపక్కల చాలా ప్రాంతాల్లో సీసీ కెమెరాలున్నాయి. కాబట్టి హంతకుడ్ని ఈజీగా పట్టుకుంటామంటున్నారు పోలీసులు. గాలింపు కోసం 5 టీమ్స్ ఏర్పాటుచేశారు. ఏటీఎం సిబ్బంది చెబుతున్న ప్రకారం.. దుండగులు 5 లక్షల డబ్బును చోరీ చేసి పారిపోయారు. మిగతా డబ్బంతా సురక్షితంగా ఉంది.

ప్రత్యక్ష సాక్ష్యులు చెబుతున్న ప్రకారం.. అక్కడకు దగ్గర్లోనే మూడో దుండగుడు కూడా ఉన్నాడు. బైక్ పై పరారైన వ్యక్తులతో పాటు మరోవైపు నుంచి ఇతడు కూడా పారిపోయినట్టు చెబుతున్నారు. ఘటనా స్థలం నుంచి కొన్ని తూటాల్ని, హెల్మెట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇది అంతర్రాష్ట్ర ముఠా చేసిన పని అని, పక్కాగా రెక్కీ చేసి మరీ ఇక్కడ దొంగతనానికి పాల్పడ్డారని పోలీసులు చెబుతున్నారు.