మ‌హ‌మ్మారి కాదు…కానీ అంత‌కంటే యాక్టీవ్‌!

దేశ‌మంతా క‌రోనా సెకెండ్ వేవ్ గురించే చ‌ర్చ‌. భ‌య‌మంటే ఏంటో తెలియ‌ని వాళ్ల‌కు కూడా …వెన్నులో వ‌ణికి పుట్టిస్తున్నది ఏదైనా ఉందంటే , అది క‌రోనా వైర‌స్ మాత్ర‌మే. అది జెట్ వేగంతో వ్యాపిస్తోంద‌ని,…

దేశ‌మంతా క‌రోనా సెకెండ్ వేవ్ గురించే చ‌ర్చ‌. భ‌య‌మంటే ఏంటో తెలియ‌ని వాళ్ల‌కు కూడా …వెన్నులో వ‌ణికి పుట్టిస్తున్నది ఏదైనా ఉందంటే , అది క‌రోనా వైర‌స్ మాత్ర‌మే. అది జెట్ వేగంతో వ్యాపిస్తోంద‌ని, ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని వైద్యులు, ప్ర‌భుత్వాలు హెచ్చ‌రిస్తున్నాయి. 

క‌రోనా సెకెండ్ వేవ్ కాలంలో గ‌త కొంత కాలంగా జాగ్ర‌త్త‌గా గ‌మ‌నిస్తే …మ‌రో ప్రాణి అత్యంత యాక్టీవ్ అయ్యింది. ఆ ప్రాణి పేరే నారా లోకేశ్‌. టీడీపీ భ‌విష్య‌త్ ఆశా కిర‌ణం. గ‌త కొంత కాలంగా ఈయ‌న చాలా యాక్టీవ్ కావ‌డం చూస్తే …చంద్ర‌బాబు త‌ప్ప‌క ఆనందిస్తుంటారు. 

ఎందుకంటే పుత్రుడు పుట్టినప్పుడు కాదు, అత‌ని గురించి లోకం పొగుడుతూ ఉన్న‌ప్పుడే తండ్రికి సంతోష‌మ‌ని సుమ‌తి శ‌త‌కంలో చెప్ప‌డాన్ని ఈ సంద‌ర్భంగా గుర్తు చేసుకోవ‌చ్చు. క‌రోనా సెకెండ్ వేవ్‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుని టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయాల‌నే డిమాండ్‌తో లోకేశ్ ఏపీ స‌ర్కార్‌పై యుద్ధం ప్ర‌క‌టించారు.

ప‌రీక్ష‌ల‌ను ర‌ద్దు చేయ‌ని జ‌గ‌న్ మామ కంసుడితో స‌మాన‌మ‌ని విద్యార్థులు భావిస్తున్నార‌ని సీఎంపై సెటైర్ విసిరారు. ఏ మాట‌కామాట చెప్పాలంటే …ప‌రీక్ష‌ల ర‌ద్దుకు సంబంధించి కేవ‌లం లోకేశ్ డిమాండ్ చేశార‌నే ఏకైక కార‌ణంతో, జ‌గ‌న్ స‌ర్కార్ మొండి ప‌ట్టుద‌ల‌కు పోయింద‌ని ఇటు ఉపాధ్యాయులు, అధ్యాప‌కులు, మెజార్టీ తల్లిదండ్రులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. 

టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల ర‌ద్దు విష‌యంలో జ‌గ‌న్ స‌ర్కార్‌పై వ‌స్తున్న వ్య‌తిరేక‌త‌ను ప‌సిగ‌ట్టిన లోకేశ్ త‌న మాట‌ల దాడిని తీవ్ర‌త‌రం చేశారు. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తూనే ఉందన్న అభిప్రాయం సొంత పార్టీ శ్రేణుల్లోనే వ్య‌క్త‌మ‌వుతోంది.

ఈ నేప‌థ్యంలో జ‌గ‌న్ స‌ర్కార్ ప్ర‌తి క‌ద‌లిక‌ను టెన్త్‌, ఇంట‌ర్ ప‌రీక్ష‌ల‌తో ముడిపెట్టి ఇరుకున పెట్టేందుకు లోకేశ్‌తో పాటు టీడీపీ నేత‌లు చురుగ్గా స్పందిస్తున్నారు. తాజాగా మంత్రివ‌ర్గ స‌మావేశం వాయిదా వేయ‌డంపై నారా లోకేశ్ త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు గుప్పించారు. కరోనా తీవ్రత దృష్ట్యా మంత్రివర్గ సమావేశం వాయిదా వేయించిన ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి.. పది, ఇంటర్‌ పరీక్షలు ఎందుకు వాయిదా వేయరని లోకేశ్ ప్రశ్నించారు.

సీఎంవి, మంత్రులవే ప్రాణాలా? లక్షల మంది విద్యార్థులవి ప్రాణాలు కావా? అని ఆయ‌న నిలదీయ‌డం గ‌మ‌నార్హం. 30 మందితో దూరంగా ఉండి పాల్గొనే మంత్రివర్గ సమావేశం వల్ల కరోనా సోకుతుందని భయపడి వాయిదా వేయించారని లోకేశ్ విమ‌ర్శించి జ‌గ‌న్ స‌ర్కార్‌ను ఆత్మ‌ర‌క్ష‌ణ‌లో ప‌డేశారు.

15లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, పరీక్షల నిర్వాహకులు, ఇతరత్రా అంతా కలిసి 80 లక్షల మందికి పైగా పరీ క్షలకు రోజూ రోడ్లమీదకు రావాల్సి ఉంటుంద‌ని ఆయ‌న గుర్తు చేశారు.  వారికి కరోనా సోకదా? అని ప్ర‌శ్నించ‌డం ద్వారా జ‌గ‌న్ స‌ర్కార్‌పై వ్య‌తిరేక అభిప్రాయాన్ని పెంచే ప్ర‌య‌త్నంలో లోకేశ్ సక్సెస్ అవుతున్నార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

సొదుం ర‌మ‌ణ‌