ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సొంత జిల్లాలో ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు బరి తెగించారు. ప్రభుత్వంతో పాటు ప్రజానీకంపై ఎమోషనల్ బ్లాక్ మెయిల్‌కు తెగబడ్డారు. ఇక మీదట కోవిడ్ రోగులను చేర్చుకోకూడదని కడప నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రులు నిర్ణయం తీసుకున్నాయి. ఈ మేరకు తమ ఆస్పత్రుల ఎదుట బోర్డులను తగిలించడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది.
కోవిడ్ పేషెంట్లకు ట్రీట్మెంట్ పేరుతో ప్రైవేట్ ఆస్పత్రులు విచ్చలవిడిగా దోచుకుంటున్నాయని కడప నగరంలోని పలు వైద్యశాలలపై పెద్ద ఎత్తున ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్లాయి. ఈ నేపథ్యంలో కడప కలెక్టర్ హరికిరణ్ సీరియస్ అయ్యారు.
జాయింట్ కలెక్టర్ నేతృత్వంలో ఓ దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి, సంబంధిత ఆస్పత్రులతో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫిర్యాదుల్లో వాస్తవం ఉన్నట్టు నిర్ధారణ అయ్యింది. దీంతో రూ.5 లక్షలు చొప్పున రెండు ఆస్పత్రులకు రూ.10 లక్షల జరిమానా విధించారు.
అంతటితో ఆగకుండా విజిలెన్స్ దాడులను పెంచారు. దీంతో తమ దోపిడీకి ప్రభుత్వం అడ్డుకట్ట వేస్తోందని ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులంతా తిరుగుబాటు బాట పట్టారు. ఈ నేపథ్యంలో ఈ రోజు నగరంలోని IMA హాల్లో కోవిడ్ సెంటర్లు నిర్వహిస్తున్న ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు సమావేశమయ్యారు.
నిబంధనల పేరుతో ప్రభుత్వం తమపై కేసులు పెట్టి, జరిమానాలు విధిస్తూ వేధింపులకు పాల్పడుతోందంటూ ఎదురు దాడికి దిగారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ ఇకపై కోవిడ్ రోగులను చేర్చుకోవద్దని ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులంతా తీర్మానించారు. వెంటనే కార్యాచరణకు కూడా దిగారు.
నగరంలోని ఆస్పత్రుల ఎదుట కోవిడ్ రోగులను జాయిన్ చేసుకోవడం లేదనే ఫ్లెక్సీలు ప్రత్యక్షమయ్యాయి. దీంతో కడప జిల్లాలోని కోవిడ్ రోగులకు కొత్త సమస్యను ప్రైవేట్ ఆస్పత్రుల యజమానులు సృష్టించారు.
దీంతో కరోనా వస్తే కేవలం గడప దాటితే వైద్యం దొరకదని, కడప దాటి వెళ్లాల్సిందేనని ప్రజానీకం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రైవేట్ ఆస్పత్రుల ధిక్కార ధోరణిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో కాలమే జవాబు చెప్పాల్సి వుంది.
సొదుం రమణ