మంగళగిరి సీఐడీ కార్యాలయంలో మాజీ మంత్రి , టీడీపీ నేత దేవినేని ఉమ విచారణపై ఆ పార్టీ నేతలు, ఎల్లో మీడియా చేస్తున్న రాద్ధాంతం అంతా ఇంతా కాదు. వీళ్ల ఓవరాక్షన్ చూస్తుంటే… ఇంతకూ ఉమ వెళ్లింది అత్తగారింటికా? లేక తప్పుడు పని చేసినందుకు విచారణకా? అనే అనుమానాలొస్తున్నాయి.
సీఎం జగన్ అనని మాటలను అన్నట్టు మార్ఫింగ్ చేసిన వీడియోలను తిరుపతి ఉప ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రి దేవినేని ప్రదర్శించడంపై వైసీపీ లీగల్ సెల్ ఫిర్యాదు చేసింది. ఈ మేరకు సీఐడీ వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసింది.
విచారణకు రావాలని రెండు సార్లు నోటీసులు పంపినా దేవినేని స్పందించలేదు. అసలు విచారణ నుంచి తప్పించుకునేందుకు ఆయన హైకోర్టును ఆశ్రయించారు. అయినా ఊరట దక్కలేదు. దీంతో హైకోర్టు ఆదేశాలతో మంగళగిరి సీఐడీ కార్యాలయంలో నేటి ఉదయం 11 గంటల నుంచి విచారణ ఎదుర్కొంటున్నారు.
ఈ సందర్భంగా దేవినేని తరపు న్యాయవాదులను లోపలకు అనుమతించలేదని, అలాగే కనీసం భోజనం కూడా పెట్టలేదని టీడీపీ నేతలు గగ్గోలు చేస్తున్నారు. దానికి ఎల్లో మీడియా డోలు కొట్టడంపై విమర్శలు వస్తున్నాయి.
ఇంతకూ దేవినేని విచారణకు వెళ్లారా? లేక మర్యాదలు పొందడానికి అత్తగారింటికి వెళ్లారా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. విచారణ పూర్తయ్యాక బిర్యానీ పెడతారులే ఉమా అని మరికొందరు నెటిజన్లు సెటైర్లు విసిరారు. ఇంతకూ ఉమాను సత్కరించడానికి పిలిచారని టీడీపీ , ఎల్లో మీడియా అనుకుంటోందా అని నెటిజన్లు సృజనాత్మక విమర్శలతో దెప్పి పొడిచారు.