విశాఖకు పరిపాలన రాజధాని వ్యతిరేకిస్తున్న టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కాన్వాయ్‌పై ఉత్తరాంధ్ర ప్రజలు చెప్పులు, కోడిగుడ్లతో దాడి చేసిన ఘటన….అనేక సంఘటనలను, చేదు జ్ఞాపకాలను గుర్తు తెస్తోంది. ‘చేసిన పాపాలు ఊరికే పోవు. అనుభవించక తప్పదు’ అనే మాటలు సర్వత్రా వినిపిస్తున్నాయి. అంతే తప్ప చంద్రబాబుపై ఎక్కడా సానుభూతి వ్యక్తం కాకపోవడం గమనార్హం.
ప్రజాచైతన్య యాత్ర పేరిట తలపెట్టిన బస్సు యాత్ర విజయనగరంలో నిర్వహించేందుకు బాబు విశాఖ విమానాశ్రయానికి వచ్చాడు. ఏపీలో మూడు రాజధానుల ప్రకటన, విశాఖలో ఎగ్జిక్యూటివ్ రాజధాని ఏర్పాటుకు నిర్ణయించిన నేపథ్యంలో బాబు వ్యతిరేకిస్తూ వస్తున్నాడు. అమరావతిలోనే రాజధాని ఉండాలంటూ బాబు ఊరూరూ తిరుగుతున్నాడు. ఈ నేపథ్యంలో విశాఖ విమానాశ్రయంలో చంద్రబాబు కాన్వాయ్‌పై ఆందోళనకారులు చెప్పులు, కోడిగుడ్లు, టమోటాలు విసిరారు.
ఈ ఘటన 1995లో దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్‌పై హైదరాబాద్ వైశ్రాయ్ హోటల్ వద్ద చెప్పులు, కోడిగుడ్లు విసిరించడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం కోసం సొంత మామనే వెన్నుపోటు పొడిచి హైదరాబాద్ నడిబజారులో తీవ్ర అవమానుపాలు చేసిన చంద్రబాబు దుర్మార్గాన్ని జనం గుర్తు చేసుకుంటున్నారు. పదవి పోయిన బాధకంటే, వైశ్రాయ్ హోటల్ వద్ద జరిగిన పరాభవమే ఎన్టీఆర్‌ను మానసికంగా కుంగదీసి, మరణానికి దారి తీసింది.
తనకు కూతురిని ఇచ్చి, రాజకీయ భిక్ష పెట్టారనే కనీస కృతజ్ఞత కూడా లేకుండా నాడు బాబు అధికార దాహంతో పాల్పడిన అప్రజాస్వామిక విధానాలను నేడు గుర్తు చేసుకుంటున్నారు. వైశ్రాయ్ హోటల్ ఎదుట ఎన్టీఆర్‌కు ఎదురైన చేదు అనుభవమే… 24 ఏళ్ల తర్వాత అదే రీతిలో విశాఖలో బాబుకు ఎదురైందంటున్నారు. తనపై చెప్పులు, కోడిగుడ్లు వేయించిన బాబుపై ఇన్నేళ్ల తర్వాత అదే రీతిలో జనం చేతిలో అవమానం ఎదురైందన్న ఆత్మ సంతృప్తి ఎన్టీఆర్‌లో కలిగి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. ఎన్టీఆర్ ఆత్మ శాంతించి ఉంటుందని ఆయన అభిమానులు అభిప్రాయపడుతున్నారు. ఎదుటి వాళ్లకు మనం ఏమిస్తే, అదే తిరిగి మనకు దక్కుతుందని నర్మగర్భంగా చెబుతున్న వారు లేకపోలేదు.