నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుందంటారు. మాటశుద్ధి లేకపోతే, దేహశుద్ధి తప్పదని ఇటీవల కొందరు రాజకీయ నేతలకు ఎదురైన చేదు అనుభవాలు కళ్లకు కట్టాయి. తాజాగా మాజీ మంత్రి, టీడీపీ నేత కొల్లు రవీంద్ర అరెస్ట్ కావడానికి, ఆయన మాట తీరే కారణమైంది. విధుల్లో ఉన్న ఎస్ఐని దూషించిన కేసులో ఆయన జైలుపాలు కావాల్సి వచ్చింది.
‘ ఏయ్ ఎస్ఐ నన్ను ఆపుతావా’ అంటూ మాజీ మంత్రి బెదిరింపులకు దిగారు. అంతటితో ఆగలేదు, ‘చంపుతావా.. చంపు’ అంటూ ఎస్‌ఐ మీదకు వెళ్లారాయన. ఎస్ఐని వెనక్కి నెట్టారు. లోపలికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించాలంటూ వాగ్వాదానికి దిగడంతో పోలీసులు చర్యలకు ఉపక్రమించారు.
మచిలీపట్నం 25వ డివిజన్ సర్కిల్‌పేటలోని పోలింగ్ కేంద్రానికి మాజీ మంత్రి కొల్లు రవీంద్రతో పాటు మరి కొందరు కార్యకర్తలు వెళ్లారు. పోలింగ్ బూత్‌లోకి వెళ్లి ఓటింగ్ సరళిని పరిశీలించాలని ఆయన హడావుడి చేశారు. దీంతో పోలీసులు జోక్యం చేసుకుని …144 సెక్షన్ అమల్లో ఉందని, లోపలికి పంపడం కుదరదని తేల్చి చెప్పారు. దీంతో ఆయనకు కోపం వచ్చింది.
పోలీసులు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. ఈ నేపథ్యంలో విధుల్లో ఉన్న ఎస్ఐతో ఆయన దురుసుగా ప్రవర్తించారు. ఈ నేపథ్యంలో విధి నిర్వహణలో ఉన్న ఎస్ఐపై చేయి చేసుకున్న మాజీ మంత్రిపై కేసు నమోదు చేశారు. ఆయన్ను ఈ రోజు ఉదయం అరెస్ట్ చేసి ఇనుకుదురు పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.