రజనీపై కమల్ సెటైర్లు.. అభిమానుల్లో అలజడి

సినిమాల్లో పోటీపడ్డా.. రాజకీయాల్లో మాత్రం కలసి ప్రయాణం చేయాలనే దాదాపుగా నిర్ణయించుకున్నారు రజనీకాంత్, కమల్ హాసన్. తమ మధ్య సయోధ్య ఉందని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలతో రజనీ స్నేహం…

సినిమాల్లో పోటీపడ్డా.. రాజకీయాల్లో మాత్రం కలసి ప్రయాణం చేయాలనే దాదాపుగా నిర్ణయించుకున్నారు రజనీకాంత్, కమల్ హాసన్. తమ మధ్య సయోధ్య ఉందని ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేశారు. అయితే బీజేపీ నేతలతో రజనీ స్నేహం కమల్ కి ఏమాత్రం నచ్చలేదు. పౌరసత్వ సవరణ చట్టంతో పాటు కొన్ని వివాదాస్పద బిల్లులకు వ్యతిరేకంగా తన గళం వినిపిస్తూ వస్తున్నారు కమల్.

రజనీ మాత్రం వివాదాల జోలికెళ్లలేదు. బహిరంగంగా మద్దతు తెలపలేదు కానీ, కమలదళానికి తమిళనాట దళపతిగా ఉండటానికే సూపర్ స్టార్ ఇష్టపడుతున్నారు. కానీ తొలిసారిగా రజనీ బీజేపీకి వ్యతిరేకంగా స్టేట్ మెంట్ ఇచ్చారు. డిల్లీ అల్లర్లకు కేంద్రం అలసత్వమే కారణమంటూ దెప్పిపొడిచారు. ఉక్కుపాదంతో అణచివేయాల్సిన ప్రభుత్వం, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. అదే ఊపులో తనని బీజేపీ మనిషిగా ముద్రవేస్తున్న మీడియాపైనా మండిపడ్డారు రజినీ.

ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. రజనీ వ్యాఖ్యలపై కమల్ స్పందించిన తీరే కాస్త వ్యంగ్యంగా ఉంది. ఇన్నాళ్లకు రజనీ రహదారి వదిలేసి రాజబాటలోకి వచ్చారని అన్నారు కమల్. “శభాష్ రజనీ.. ఇన్నాళ్లకు రహదారి వదిలేసి రాజబాటలోకి వచ్చావ్, నువ్వు ఇలాగే ముందుకెళ్లాలి” అంటూ ట్వీట్ చేశారు. రజనీ స్పందనపై కమల్ ప్రతిస్పందన బాగానే ఉన్నా.. దాంట్లో రజనీ పంచ్ డైలాగ్ అయిన “నా దారి రహదారి”ని గుర్తు చేయడమే కాస్త సెటైరిక్ గా ఉంది.

రజనీ రహదారి వదిలేసి రాజబాటలోకి వచ్చాడని అనడంపై రజనీ అభిమానులు కూడా కాస్త తీవ్రంగానే స్పందిస్తున్నారు. రజనీది ఎప్పుడూ రాజబాటేనని రివర్స్ అటాక్ మొదలు పెట్టారు. రాజకీయాల్లో ఇప్పటివరకూ స్నేహితులుగానే ఉన్న రజనీ-కమల్ మధ్య.. ఈ వ్యవహారం చిన్న గ్యాప్ తీసుకొచ్చేలా ఉందంటున్నారు పరిశీలకులు. కమల్ వ్యాఖ్యలపై రజనీ ఎలా స్పందిస్తారో చూడాలి. 

నాలుగేళ్ల తర్వాత హిట్‌ వచ్చింది