2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి నేతృత్వంలో అప్పుడప్పుడే కాంగ్రెస్ సర్కార్ కొలువుదీరింది. అదే సమమంలో అనంతపురం జిల్లా ఉరవకొండకు చెందిన సీపీఎం నాయకుడు విశ్వేశ్వరరెడ్డి తన అనుచరులతో కలసి వైఎస్సార్ సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నాడు. ఈ సందర్భంగా ‘విశ్వా నీ ప్రాధాన్యతలు ఏంటి? ఏం కావాలి?’ అని వైఎస్సార్ అడిగాడు. ‘అన్నా కరవుతో అల్లాడుతున్న మా అనంతపురం జిల్లాకు హంద్రీ-నీవా నీళ్లు కావాలి. పంటలు సాగు చేసి నష్టపోయిన రైతులకు బీమా సొమ్ము కావాలి’ అని విశ్వ ఉద్వేగంతో జవాబిచ్చాడు.
విశ్వేశ్వరరెడ్డిని వైఎస్సార్ అమాయకంగా చూస్తూ…బిగ్గరగా నవ్వుతూ ‘ఈ కాలంలో కూడా నీలాంటి రాజకీయ నాయకుడు ఉన్నాడంటే నమ్మలేకున్నానయ్యా. నీలాంటి వాళ్లు ఈ సమాజానికి, మన పార్టీకి చాలా అవసరం’ అని భుజం తట్టి ప్రోత్సహించాడు. విశ్వేశ్వరరెడ్డి క్యారెక్టర్ అది. అందుకే ఆయనంటే ఒక్క వైసీపీ నేతలకే కాదు ప్రత్యర్థులకు కూడా గౌరవం.
నీతి, నిజాయితీ, నమ్మిన వారి కోసం ఎందాకైనా పోరాడేతత్వం, మృధుస్వభావం కలిగిన విశ్వేశ్వరరెడ్డిని పక్కన పెట్టి…. ప్రత్యర్థి పార్టీకి చెందిన ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్‌ను వైసీపీలోకి చేర్చుకునేందుకు లోపాయికారి చర్చలు జరుగుతున్నాయని సమాచారం. పయ్యావులను పార్టీలోకి తీసుకొస్తున్నారనే సమాచారం ఉరవకొండ వైసీపీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఈ సందర్భంగా విశ్వేశ్వరరెడ్డి, పయ్యావుల కేశవ్ వ్యక్తిత్వాలు, నిబద్ధతను అనంతపురం జిల్లా ప్రజలు పోల్చి చెబుతున్నారు.
అనంతపురం జిల్లాలో విశ్వేశ్వరరెడ్డిది బలమైన కమ్యూనిస్టు కుటుంబం. విశ్వేశ్వరరెడ్డి తండ్రి రాకెట్ల నారాయణరెడ్డి నిఖార్సైన కమ్యూనిస్టు నాయకుడు. సుమారు 300 ఎకరాల సొంత భూమిని పేదలకు పంచిన త్యాగశీలి. అలాగే ఆయన నేతృత్వంలో పెద్ద ఎత్తున భూపోరాటాలు చేసి ల్యాండ్ సీలింగ్ యాక్ట్ ప్రకారం 2 వేల ఎకరాలను నాటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ చేతుల మీదుగా పేదలకు పంచిన మానవతావాది. ఇందులో ప్రస్తుత ఉరవకొండ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ కుటుంబానికి చెందిన భూమి కూడా ఉంది.
తమ భూమిని పేదలకు పంచిన రాకెట్ల నారాయణరెడ్డిపై పయ్యావుల కుటుంబం కక్ష కట్టిందని అనంతపురం జిల్లా వాసులు చెబుతారు. రాకెట్ల నారాయణరెడ్డి, ఆయన తనయుడు రవీంద్రరెడ్డిలపై సూడో నక్సలైట్లు 1994లో హత్య చేశారు. అయితే ఈ హత్యలతో తమకు ఎలాంటి సంబంధం లేదని అప్పట్లో నక్సలైట్ నాయకుడు గణపతి వర్గం ప్రకటించింది. అంతేకాదు పోరాట యోధుడిని చంపడంపై నక్సలైట్లు కూడా విచారం వ్యక్తం చేశారు.
టీడీపీతో సీపీఐ పొత్తులో భాగంగా విశ్వేశ్వరరెడ్డి పయ్యావుల కేశవ్ గెలుపు కోసం ప్రచారంలో ఉండగా…తండ్రితో పాటు తమ్ముడిని పోగొట్టుకున్నాడు. వీరి హత్యల వెనుక ఎవరున్నారనేది అనంతపురం జిల్లాలో బహిరంగ రహస్యమే. కమ్యూనిస్టు నాయకుడిగా విశ్వేశ్వరరెడ్డి కార్మిక, కర్షక, అణగారిన వర్గాల పక్షాన అవిశ్రాంత పోరాటం చేసిన, చేస్తున్న నేతగా జిల్లా ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నాడు.
వైఎస్సార్ మరణానంతరం జగన్‌కు అండగా నిలిచిన అనంతపురం నేతల్లో విశ్వేశ్వరరెడ్డి మొదటి వరుసలో ఉన్నాడు. జగన్ సొంత పార్టీ పెట్టగానే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి ‘జై జగన్’ అన్నాడు. విశ్వేశ్వరరెడ్డి వ్యక్తిత్వం అంటే జగన్‌కు కూడా ప్రత్యేక గౌరవమే. అందుకే 2014 ఎన్నికల్లో ఉరవకొండ టికెట్‌ను విశ్వకు కేటాయించాడు. ఆ ఎన్నికల్లో అనంతపురం జిల్లాలో 12 చోట్ల టీడీపీ, 2 చోట్ల వైసీపీ గెలిచింది. కదిరితో పాటు ఉరవకొండలో మాత్రమే వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు.
ఆ తర్వాత కొంత కాలానికి కదిరి ఎమ్మెల్యే చాంద్‌బాషా టీడీపీ కండువా కప్పుకున్న విషయం తెలిసిందే. విశ్వాపై ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా, ఎన్నో ప్రలోభాలకు గురి చేసినా…నమ్మిన నేతతో పాటు విలువలకు కట్టుబడి ఉండాలనే నైతికతతో వైసీపీలోనే ఉన్నాడు. ప్రజాసమస్యలపై అసెంబ్లీలోనూ, అసెంబ్లీ వెలుపల అనేక పోరాటాలు చేసిన నేతగా గుర్తింపు పొందాడు.
2019 ఎన్నికల్లో రెండు కారణాలతో ఆయన ఓటమి పాలయ్యాడు. ఒకటి నియోజకవర్గానికి చెందిన సొంత పార్టీ నేతలే ఆయనకు వ్యతిరేకంగా పనిచేయడం, రెండు ఉరవకొండలో గెలిచిన పార్టీ అధికారంలోకి రాదనే సెంటిమెంట్‌తో పార్టీ శ్రేణులు కొంత వరకు వ్యతిరేకంగా ఓట్లు వేయడం.
ఇక పయ్యావుల కేశవ్ విషయానికి వస్తే 2014లో ఎమ్మెల్యేగా ఓడిపోయినప్పటికీ ఎమ్మెల్సీ పదవిని బాబు కట్టబెట్టాడు. అంతేకాదు మండలిలో చీఫ్‌విప్ పదవితో కేశవ్ నాయకత్వాన్ని బాబు బలపరిచే యత్నం చేశాడు. అంతేకాదు తాజాగా ప్రతిపక్షానికి వచ్చే ఒకే ఒక్క పదవైన పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్‌గా పయ్యావుల కేశవ్‌ను నియమించిన విషయం తెలిసిందే. పయ్యావులకు చంద్రబాబు అంతగా ప్రాధాన్యం ఇచ్చాడు, ఇప్పటికీ ఇస్తున్నాడనేందుకు ఇదే నిదర్శనం. అలాంటిది చంద్రబాబును కాదని, టీడీపీని విడిచి పెట్టేందుకు పయ్యావుల నిర్ణయించుకున్నారంటే….ఆయన వ్యక్తిత్వం ఎలాంటిదో ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏముందని వైసీపీ శ్రేణులు ప్రశ్నిస్తున్నాయి.
కానీ సీఎం జగన్ కొన్ని విషయాల్లో చంద్రబాబును ఫాలో అవుతున్నారనే విమర్శలు లేకపోలేదు. కుల సమీకరణల్లో భాగంగా కమ్మ సామాజికవర్గానికి చెందిన పయ్యావుల కేశవ్‌ను తెచ్చుకుంటే ఉరవకొండతో పాటు అనంతపురం జిల్లాలో వైసీపీ బలపడుతుందని కొందరు చెబుతున్న మాటలను జగన్ నమ్మడం ఏంటనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదే చంద్రబాబు నలుగురు వైసీపీ రెడ్ల ఎమ్మెల్యేలకు మంత్రి పదవులు ఇచ్చినప్పటికీ….తర్వాత జరిగిన ఎన్నికల్లో ఏ గతి పట్టిందో జగన్ కంటే బాగా తెలిసిన వారెవరని వైసీపీ కార్యకర్తలు ప్రశ్నిస్తున్నారు.
ఇప్పటికే వైసీపీ స్ట్రాంగ్‌గా ఉందని, ఓడిన విశ్వేశ్వరరెడ్డి లాంటి వారికి తగిన ప్రాధాన్యం ఇస్తే…పార్టీ బలపడుతుందనే వాదన వినిపిస్తోంది. అంతే తప్ప ఫిరాయింపులపై అసెంబ్లీ వేదికగా నీతులు చెప్పిన జగన్….పయ్యావులను చేర్చుకోవడం ద్వారా సమాజానికి ఎలాంటి సందేశం పంపుతారనే ప్రశ్న సొంత పార్టీ కార్యకర్తలు, నేతల నుంచి వినిపిస్తోంది. పయ్యావులను వైసీపీలోకి చేర్చుకోవడం లాంటి తప్పు పనులు జగన్ చేయడని నమ్ముతున్నట్టు కార్యకర్తలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. పయ్యావుల కేశవ్ విషయంలో జగన్ నిర్ణయం ఏంటనేది కాలమే జవాబు చెప్పాల్సి ఉంది.