జనసేనాని పవన్‌కల్యాణ్ ఇంత కాలం పేదలపై కనబరుస్తున్న ప్రేమ ఉత్త నటన. ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటనే ఇందుకు నిదర్శనం. పవన్ ద్వంద్వ వైఖరిని మరోసారి తనకు తానే చాటుకున్నాడు. రాజధాని అమరావతిలో పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని జగన్ సర్కార్ నిర్ణయిస్తే….దాన్ని తప్పు పడుతూ ఆయన ప్రకటన విడుదల చేశారు. గతంలో రాజధానిలో పేదలు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా అని ప్రశ్నించిన పెద్ద మనిషే…నేడు జగన్ సర్కార్ పేదల ఇళ్ల కలలను నెరవేరుస్తుంటే , స్వాగతించడానికి బదులు వ్యతిరేకించడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
వివాదాలకు తావులేని భూములనే ఇళ్ల స్థలాలకు కేటాయించాలని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ డిమాండ్ చేశాడు. రాజధానికి సమీకరించిన భూములను ఇళ్ల స్థలాలకు ఇవ్వడం సరికాదని ఆయన పేర్కొన్నాడు. ఈ మేరకు పవన్ ఒక ప్రకటన విడుదల చేశాడు. రాజధాని ప్రాంతంలో ఇళ్ల స్థలాల అంశంపై ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన వివాదానికి ఆస్కారమిస్తుందని ఆయన అభిప్రాయపడ్డాడు. ఇల్లు లేని పేదలకు స్థలం కేటాయించడాన్ని ఎవరూ తప్పు పట్టరని, ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎలాంటి వివాదాలు లేని భూములనే పంచాలని ఆయన డిమాండ్ చేశాడు.
‘ఓ వైపు రైతులు ఉద్యమాలు చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం పట్టాల కోసం ఆదేశాలు ఇవ్వడం ప్రజల మధ్య చిచ్చుపెట్టడమే. రాజధానికి ఉద్దేశించిన భూములను లబ్ధిదారులకు ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోంది. తదుపరి వచ్చే చట్టపరమైన చిక్కులతో ఇబ్బంది పడేది పేదలే’…ఇదీ పవన్‌కల్యాణ్ పేదలను హెచ్చరిస్తున్న తీరు. ఇబ్బందులు రాకుండా తనవంతు ప్రయత్నం చేయాల్సిన పవన్…అందుకు విరుద్ధంగా పేదలను బెదిరించే రీతిలో ప్రకటన ఇచ్చి…తాను ఎటు వైపు చెప్పకనే చెప్పాడాయన.
ఇదే పెద్ద మనిషి గతంలో ఏమన్నాడో తెలుసుకుందాం.
‘ అమరావతికి నేను ఒక పార్వతీపట్నం నుంచో లేదంటే ఆముదాలవలస నుంచో వెళ్తాను. నేనొక సామాన్యున్ని. అమరావతిలో నాకు స్థలం కావాలంలే ఎలా? గవర్నమెంట్ 33 వేల ఎకరాలో, లక్ష ఎకరాలో పెట్టుకొంది. ఎట్లా ఇస్తారు మీరు. నేను ఇక్కడ ఉండాలి, పనిచేస్తాను. నాకు కనీసం ఇల్లు కట్టుకునే అవసరం ఉంటుంది కదా. ఉత్తరాంధ్ర నుంచి ఇక్కడికి వచ్చి ఎలా స్థిరపడతారు? రాయలసీమ ప్రాంతవాసులు ఇక్కడ ఎలా స్థిరపడతారు. ప్రతి జిల్లా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడాలనుకుంటే ఏమైనా చర్యలు తీసుకున్నారా? 33 వేల ఎకరాల్లో ఒక్కో ప్రాంతానికి లేదా జిల్లాకి కానీ 2వేల ఎకరాల చొప్పున ఇయర్ మార్చ్ చేశారా? ప‌్రతి అంశంలోనూ చంద్రబాబు పార్టీ బలమైన వైఫల్యాన్ని చూపుతూ వచ్చింది’
చూశారా, పవన్‌లోని రెండు నాల్కల ధోరణి. అమరావతిలో నాకు స్థలం కావాలంటే ఎలా? అని పేద్ద హీరోలా ప్రశ్నించిన పవన్…ఇప్పుడేమో పేదలకు పిలిచి మరీ ఇంటి స్థలం ఇస్తుంటే, ఎలా ఇస్తారని నిలదీస్తున్నాడు. ఇదన్న మాట మన జనసేనానికి పేద, బడుగు, బలహీన వర్గాలపై ఉన్న ప్రేమ. ఆయన వృత్తే కాదు, ప్రవృత్తి కూడా నటనే. అందుకు ఇదే నిలువెత్తు నిదర్శనం.