ఎమ్మెస్సార్ హయాంలోనే తెలంగాణ వచ్చి ఉండేదా?

ఇప్పటికీ తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకులు ఆసక్తిగా చర్చించుకునే అంశం ఇది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) హయాంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది. కానీ కొన్ని రాజకీయ కారణాలు, రాష్ట్రంలో…

ఇప్పటికీ తెలంగాణలో సీనియర్ రాజకీయ నాయకులు ఆసక్తిగా చర్చించుకునే అంశం ఇది. అన్నీ అనుకున్నట్టు జరిగితే ఎం.సత్యనారాయణరావు (ఎమ్మెస్సార్) హయాంలోనే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఉండేది. కానీ కొన్ని రాజకీయ కారణాలు, రాష్ట్రంలో ఉన్న ప్రత్యేక పరిస్థితుల వల్ల అప్పట్లోనే తెలంగాణ సాధన చేజారిపోయిందని అంటారు. లేకపోతే తెలంగాణ సాధన యోధుడిగా ఎమ్మెస్సార్ నిలిచేవారు.

1969 నుంచి 1971 వరకు ప్రత్యేక తెలంగాణ కోసం జరిగిన పోరాటంలో ఎమ్మెస్సార్ కీలక పాత్ర పోషించారు. మేడ్చల్ కు చెందిన సంగిరెడ్డి వెంకటరామిరెడ్డి, వందేమాతరం రామచంద్రరావు లాంటి వాళ్లు ఉద్యమానికి రూపకల్పన చేశారు. కాంగ్రెస్ కోసం పనిచేస్తున్న 22 మంది కీలకమైన వ్యక్తుల్ని హైదరాబాద్ పిలిచి సమావేశం ఏర్పాటుచేశారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆ రోజుల్లో ఉవ్వెత్తున నడిచింది. ఎమ్మెస్సార్ అందులో అత్యంత కీలకంగా పనిచేశారు.

ఆ ఆందోళన కార్యక్రమాల్లో వందలాది మంది విద్యార్థులు అమరులయ్యారు. జరిగిన హింసాత్మక ఘటనలకు బాధ్యుడ్ని చేస్తూ ఎమ్మెస్సార్ తో పాటు మరికొంది నాయకులపై కేసులు పెట్టారు. పీడీ యాక్ట్ చట్టం కింద వరంగల్ లోని జైళ్లో ఎమ్మెస్సార్ ను 3 నెలలు నిర్బంధించారు. ఆ తర్వాత అట్నుంచి అటు చంచల్ గూడ జైలుకు తీసుకెళ్లారు. అక్కడ మరో 3 నెలలు జైళ్లో ఉన్నారు.

ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో అత్యథిక మెజారిటీతో గెలిచి ఎంపీగా పార్లమెంట్ లో అడుగుపెట్టిన ఎమ్మెస్సార్ ను చూసి ఇందిరాగాంధీ ఆశ్చర్యపోయారు. దేశమంతా ఇందిరా గాంధీ గాలి వీస్తుంటే.. తెలంగాణలో మాత్రం కాంగ్రెస్ పప్పులుడకలేదు.

ఓవైపు ఇంత జరిగినప్పటికీ తెలంగాణ సాధన మాత్రం జరగలేదు. ఇందిర తరఫున రంగంలోకి దిగిన జాతీయ నాయకుడు కేసీ పంత్, తెలంగాణకు ఐదు సూత్రాల ఒప్పందాన్ని అంటగట్టారు. అప్పట్లో ఇందిరను ఏమీ చేయలేక, ఐదు సూత్రాల ఒప్పందానికి అంగీకరించి, తెలంగాణ ప్రజా సమితిని కాంగ్రెస్ లో విలీనం చేశారు. అప్పుడే కాస్త గట్టిగా నిలబడి ఉన్నట్టయితే తెలంగాణ వచ్చి ఉండేది. అలా ఉద్యమం టైమ్ లో ఇందిరను తీవ్రంగా వ్యతిరేకించిన ఎమ్మెస్సార్, ఆ తర్వాత ఆమెకే అత్యంత ఆప్తుడిగా మారిపోయారు.

ఇంటర్మీడియట్ నుంచి హైదరాబాద్ లోనే ఉన్న ఎమ్మెస్సార్, తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేశారు. 87 ఏళ్ల ఈ సీనియర్ నేత, కరోనా బారిన పడి నిమ్స్ లో చికిత్స పొందుతూ, ఈరోజు ఉదయం తుదిశ్వాస విడిచారు.