ఎమ్మెస్ కు నివాళి

సీనియర్ కాంగ్రెస్ నేత ఎం సత్యనారాయణ రావు గారి మృతికి నివాళి. Advertisement 1990 దశకంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా అనేక సందర్భాల్లో ఆయన విజయవాడ వచ్చారు. వచ్చిన ప్రతిసారి ఆయనను కలిసే అవకాశం…

సీనియర్ కాంగ్రెస్ నేత ఎం సత్యనారాయణ రావు గారి మృతికి నివాళి.

1990 దశకంలో ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షులుగా అనేక సందర్భాల్లో ఆయన విజయవాడ వచ్చారు. వచ్చిన ప్రతిసారి ఆయనను కలిసే అవకాశం వచ్చేది.

1996లో కృష్ణా జిల్లాలో ఉయ్యూరు శాసనసభ నియోజకవర్గానికి (ఇప్పుడు ఈ నియోజకవర్గం రద్దయింది.) ఉపఎన్నిక జరిగింది.

టీడీపీ శాసనసభ్యుడు అన్నే బాబూరావు అకాల మృతితో ఈ ఉపఎన్నిక వచ్చింది.  అన్నే బాబూరావు సతీమణి అన్నే విజయలక్ష్మిని తమ అభ్యర్థిగా టీడీపీ రంగంలోకి దింపింది. కాంగ్రెసు పార్టీ కె పి సారధిని రంగంలోకి దింపింది. ప్రచారం కోసం పీసీసీ అధ్యక్షుడు హోదాలో ఎమ్మెస్ విజయవాడ వచ్చారు.

బృందావన్ కాలనీలో ఓ ప్రైవేటు అతిధి గృహంలో ఆయన బస చేశారు. ఆయనతో పాటు అప్పటి కాంగ్రేస్ పెద్దలు పిన్నమనేని కోటేశ్వరరావు, కావూరి సాంబశివరావు, చనుమోలు వెంకట్రావు, కోనేరు రంగారావు, పాలడుగు వెంకట్రావు, తదితరులతో పాటు దేవినేని నెహ్రూ కూడా ఉన్నారు.

మీడియా ప్రతినిధులు ఎవరినీ అతిధి గృహంలోకి రానివ్వడంలేదు అన్నారు. అయినా ఓ ప్రయత్నం చేద్దామని వెళ్ళా.(అప్పట్లో డెక్కన్ క్రానికల్ లో ఉన్నాలేండి). మొదట సెక్యూరిటీ వాళ్ళు లోపలికి అనుమతించలేదు. తర్వాత లోపల ఉన్న చనుమోలు వెంకట్రావు గారు ఏదో పనిమీద గది బయటకు వచ్చినప్పుడు గేటుదగ్గర నన్ను చూసి లోపలికి రమ్మన్నారు. అలా లోపలికి, అక్కడినుండి నేరుగా గదిలోకి వెళ్ళాను.

ఏవేవో మాటలు జరుగుతున్నాయి. అప్పట్లో “ఆఫ్ ది రికార్డ్” అని ఒకటి ఉండేది లేండి. అలా ఆఫ్ ది రికార్డు మాట్లాడేవి ఏవీ రిపోర్టు చేసేవాళ్ళం కాదు. (కానీ స్పెషల్ స్టోరీల్లో వాడేసేవాళ్ళం – ఎవరి పేరు ప్రస్తావించకుండా). అలా ఆరోజు గదిలో జరిగే సంభాషణ అంతా ఆఫ్ ది రికార్డ్ కావడం వల్ల, పైగా అక్కడ ఉన్న జర్నలిస్టు నేను కావడం వల్ల అందరూ వాళ్ళ రాజకీయాలు స్వేచ్ఛగా మాట్లాడేసుకున్నారు.

ఈ మాటల్లోనే ఎమ్మెస్ ఓ కామెంటు చేశారు. ఎమ్మెల్యే చనిపోతే, ఆయన భార్యను నిలబెడితే ఎలా అంటూ టీడీపీ నిర్ణయం పై అభ్యంతరం తెలిపి, 'ఇలా చనిపోయిన ప్రతి ఎమ్మెల్యే భార్యను గెలిపిస్తే అసెంబ్లీ విధవరాండ్ర సభ అవుతుంది' అని ఎమ్మెస్ నవ్వేశారు. మిగతా కాంగ్రెస్ సభ్యులు కూడా గట్టిగా నవ్వేశారు.

తర్వాత ఎన్నికల ప్రచారానికి ఉయ్యూరు వెళ్ళిపోయారు. అయితే వాళ్ళు ఉయ్యూరు చేరక ముందే ఓ టీవీలో ఎమ్మెస్ చేసిన “విధవరాండ్ర సభ” వ్యాఖ్య వచ్చింది. అది పెద్ద దుమారం రేపింది.  ఇదెలా జరిగిందో మొదట నాకు అర్ధం కాలేదు. ఆ సాయంత్రానికి కాంగ్రెస్ నాయకులే అడిగారు “నీతోపాటు గదిలోకి వచ్చింది టీవీ రిపోర్టరా?” అని. నాతో ఎవరూ రాలేదే అన్నాను. “లేదు, మీ వెనుకనే ఓ అబ్బాయి వచ్చాడు. మీవాడే అనుకున్నాం” అన్నారు.

నా వెనుక ఎవరు వచ్చారో నేను చూసుకోలేదు. చూసిన కాంగ్రెస్ నేతలు 'మావాడేనేమో' అనుకున్నారు. ఆ తర్వాత నేను ఆరా తీస్తే నేను అతిథి గృహంలోకి అలా వెళ్తున్నప్పుడు నా వెనుక ఓ జూనియర్ రిపోర్టర్ కూడా ఉన్నాడని తెలిసింది.

వెనుక ఎవరన్నా వస్తున్నారేమో చూసుకోకపోవడం నా తప్పు. నా వెనుక ఉన్న వ్యక్తిని ఎవరతను అని అడక్కపోవడం వాళ్ళ తప్పు. అలా సర్దుకున్నాం. అప్పటినుండి కాస్త జాగ్రత్తగా ఉండడం నేర్చుకున్నా. కానీ, ఆ వార్త అప్పట్లో కాంగ్రెసు పార్టీకి పెద్ద నష్టమే చేసింది.

కాంగ్రెస్ పెద్దలు చాలాసార్లు ఈ విషయం గుర్తు చేసేవారు. ఎమ్మెస్ కూడా చాలాసార్లు “మా కొంప ముంచావయ్య” అంటూ నవ్వుతూ భుజమ్మీద చరిచేవారు. చాలా భోళా మనిషి. ఏదీ మనసులో దాచుకునేవారు కాదు. అలాంటి నాయకులు ఇప్పుడు కాస్త అరుదే.

Facebook post from Gopi Dara