మ‌ళ్లీ తెర‌పైకి నిమ్మ‌గ‌డ్డ‌

మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చారు. ఈసీపై మ‌ద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలోనూ, ఏ ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లోనూ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్య‌వ‌హార‌శైలిపై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ఆంధ్ర‌ప్రదేశ్‌లో…

మాజీ ఎస్ఈసీ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ మ‌ళ్లీ తెర‌పైకి వ‌చ్చారు. ఈసీపై మ‌ద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో సోష‌ల్ మీడియాలోనూ, ఏ ఇద్ద‌రి మ‌ధ్య చ‌ర్చ‌లోనూ నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ వ్య‌వ‌హార‌శైలిపై విమ‌ర్శ‌లు చెల‌రేగుతున్నాయి. ఆంధ్ర‌ప్రదేశ్‌లో క‌రోనా సెకండ్ వేవ్ ఉధృతికి నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ పంత‌మే కార‌ణ‌మ‌నే ఆరోప‌ణ‌లు వెల్లువెత్త‌డం గ‌మ‌నార్హం. అలాగే నాడు నిమ్మ‌గ‌డ్డ‌కు వంత పాడిన ప్ర‌తిప‌క్షాలు, ఎల్లో మీడియాపై కూడా నెటిజ‌న్లు సెటైర్ల‌తో విరుచుకుప‌డుతున్నారు.

ప్ర‌స్తుతం త‌మిళ‌నాడులో అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌క్రియ సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మంత్రి విజ‌య‌భాస్క‌ర్ క‌రూర్ స్థానం నుంచి బ‌రిలో నిలిచారు. అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి మ‌రో 77 మంది అభ్య‌ర్థులు త‌ల‌ప‌డుతున్నారు. అయితే ఈ నియోజ‌క వ‌ర్గ కౌంటింగ్‌ను కేవ‌లం రెండు గ‌దుల్లో ఏర్పాటు చేశార‌ని, వారికి సంబంధించిన ఏజెంట్లంద‌రినీ కౌంటింగ్ హాల్లోకి అనుమ‌తిస్తే భౌతిక‌దూరం పాటించ‌డం క‌ష్ట‌మ‌వుతుంద‌ని హైకోర్టులో పిటిష‌న్ వేశారు.

ఈ పిటిష‌న్‌పై విచార‌ణ సంద‌ర్భంలో చీఫ్ జ‌స్టిస్ సంజీవ్ బెన‌ర్జీ, జ‌స్టిస్ సెంథిల్‌కుమార్ రామ‌మూర్తిల‌తో కూడిన ధ‌ర్మాస‌నం తీవ్రంగా స్పందించింది.

“మీ మీద మ‌ర్డ‌ర్ కేసు పెడితే స‌రిపోతుంది. ఇక్క‌డా (త‌మిళ‌నాడు), దేశంలోనూ కొవిడ్ సెకండ్ వేవ్ పెర‌గ‌డానికి మీరే కార‌ణం. అత్యంత బాధ్య‌తా ర‌హిత సంస్థ” అని ఈసీకి మ‌ద్రాస్ హైకోర్టు ధ‌ర్మాస‌నం చీవాట్లు పెట్టింది. కోవిడ్ క‌ట్ట‌డి నిబంధ‌న‌ల‌ను ప‌క‌డ్బం దీగా అమ‌లు చేస్తామ‌ని ఈసీ త‌ర‌పు న్యాయ‌వాదులు చెప్ప‌గా….  ధ‌ర్మాస‌నం జోక్యం చేసుకుని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

“స‌భ‌లు, ప్ర‌ద‌ర్శ‌న‌లు జ‌రుపుకోవ‌డానికి రాజ‌కీయ పార్టీల‌కు మీరిచ్చిన అనుమ‌తులే దేశ వ్యాప్తంగానూ ఈ ప‌రిస్థితిని తెచ్చి పెట్టాయి. కౌంటింగ్ నిలిపి వేస్తూ మేం నిర్ణ‌యం తీసుకుంటే మ‌మ్మ‌ల్ని ఎవ‌రూ అడ్డుకోలేరు” అని ధ‌ర్మాస‌నం హెచ్చ‌రించింది. ఈసీపై మ‌ద్రాస్ హైకోర్టు ఘాటు వ్యాఖ్య‌ల నేప‌థ్యంలో …నాడు ఏపీ ఎస్ఈసీ హోదాలో నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్ త‌న పంతాన్ని నెగ్గించుకోవ‌డానికి రాజ్యాంగ వ్య‌వ‌స్థ స్వ‌యంప్ర‌తిప‌త్తిని అడ్డుపెట్టుకుని స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను జ‌రిపించార‌నే విమ‌ర్శ‌లు మ‌ళ్లీ మొద‌ల‌య్యాయి.

క‌రోనా సెకండ్ వేవ్ హెచ్చ‌రిక‌ల దృష్ట్యా కొంత కాలం స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల‌ను వాయిదా వేయాల‌ని నిమ్మ‌గ‌డ్డ‌కు జ‌గ‌న్ ప్ర‌భుత్వం మొర పెట్టుకున్నా వినిపించుకోలేద‌ని నెటిజ‌న్లు మండిప‌డుతున్నారు. మ‌ద్రాస్ హైకోర్టు తీవ్ర హెచ్చ‌రిక‌లు నిమ్మ‌గ‌డ్డ ర‌మేశ్‌కుమార్‌కు కూడా వ‌ర్తిస్తాయ‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

నిమ్మ‌గ‌డ్డ‌పై కూడా మ‌ర్డ‌ర్ కేసు పెట్టాల‌నే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. జ‌గ‌న్ ప్ర‌భుత్వం కోరిన‌ట్టు వ్యాక్సినేష‌న్‌కు అవ‌కాశం క‌ల్పించి ఉంటే, నేడు ఈ దుస్థితి వ‌చ్చేది కాద‌ని అంటున్నారు. ఇప్పుడు నిమ్మ‌గ‌డ్డ ఎక్క‌డున్నారో తెలియ‌ద‌ని, ఆయ‌న చ‌ర్య‌ల వ‌ల్ల ప్ర‌జ‌లు మూల్యం చెల్లించుకోవాల్సి వ‌చ్చింద‌నే ఆవేద‌న‌,  ఆగ్ర‌హం వ్య‌క్తమ‌వుతోంది.

సొదుం ర‌మ‌ణ‌