మాజీ ఎంపీ సబ్బం హరి టీడీపీ సీనియర్ నేత. గతంలో ఆయన కాంగ్రెస్ ఎంపీగా పనిచేశారు. వైఎస్సార్ మరణానంతరం కొంత కాలం ఆయన తనయుడు వైఎస్ జగన్ వెంట నడిచారు. ఆ తర్వాత ఎక్కడ బెడిసిందో తెలియదు కానీ, వైఎస్ జగన్కు క్రమంగా దూరమయ్యారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో విశాఖలో వైఎస్ విజయలక్ష్మి ఓటమి పాలు కావడంలో సబ్బం హరి పాత్ర కూడా కీలకమైందే.
ఇక ప్రస్తుతానికి వస్తే సబ్బం హరి ఈ నెల 15న కరోనా బారిన పడ్డారు. విశాఖలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ట్రీట్మెంట్ తీసుకుం టున్నారు. నిన్న మధ్యాహ్నం ఆయన పరిస్థితి విషమించినట్టు వార్తలొచ్చాయి. దీంతో సహజంగానే టీడీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకుంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్టు వైద్య వర్గాలు చెప్పాయి. సబ్బం హరి ఆరోగ్యం కుదుట పడాలని అంతా కోరుకుంటున్నారు.
తమ పార్టీ ముఖ్యనేత ఆరోగ్యంపై చంద్రబాబుకు ఎక్కువ ఆందోళన ఉండడాన్ని అర్థం చేసుకోవచ్చు. సబ్బం హరికి మెరుగైన వైద్యం అందించాలనే బలమైన కోరిక కూడా తప్పక ఉంటుంది. అవన్నీ రెండో మనిషికి తెలియకుండా పార్టీ ముఖ్య నేతలను పురమాయించి సబ్బం హరికి మెరుగైన ట్రీట్మెంట్ ఇప్పించొచ్చు. ఈ విషయం ఎవరికీ తెలియాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే ఏం చేసినా సొంత పార్టీ నేతకే కాబట్టి.
కానీ చంద్రబాబు ప్రచార కక్కుర్తి ఏ స్థాయిలో ఉందంటే…సబ్బం హరికి మెరుగైన వైద్యం అందించకుండానే, ఏదో చేసిన బిల్డప్. సబ్బం హరికి మెరుగైన వైద్యం అందించేందుకు అమెరికాలోని వైద్యులతో చంద్రబాబు సంప్రదిస్తున్నట్టు విస్తృత ప్రచారాన్ని చేయించుకోవడం ఎందుకో అర్థం కాదు. ఎయిర్ అంబులెన్స్ కోసం చంద్రబాబు ప్రయత్నిస్తున్నారట! అది కూడా హైదరాబాద్కు తరలించేందుకట!
ఇదేదో అమెరికా వైద్యులతో సంప్రదించి సబ్బం హరికి మెరుగైన వైద్యం అందించాక ప్రచారం చేసుకుని ఉంటే బాగుండేది కదా అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎయిర్ అంబులెన్స్ కోసం ప్రయత్నించడం కూడా ఓ పెద్ద సేవా కార్యక్రమంగా పది మందికి తెలియాలనే యావ ఒక్క చంద్రబాబులోనే చూస్తున్నామని నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదే సబ్బం హరి కోలుకుని లేదా ఆయన కుటుంబ సభ్యులు మీడియా ముందుకొచ్చి తమ కోసం చంద్రబాబు చేస్తున్న ప్రయ త్నాల గురించి చెప్పి ఉంటే గౌరవంగా ఉండేదనే అభిప్రాయాలు సబ్బం అనుచరుల నుంచి వ్యక్తమవుతున్నాయి. అసలు సబ్బం హరి కోసం ఏమీ చేయకుండానే, కేవలం ప్రయత్నాల్లో ఉండగానే పెద్ద ఎత్తున ప్రచారం చేసుకోవడం అంటే… సబ్బం అనారోగ్యాన్ని కూడా సొమ్ము చేసుకోవడంతో పాటు తమ నేతను అవమానించినట్టే అని హరి అనుచరుల వాదన.