తెలుగు దిన పత్రికలు- తెలుగు భాష ప్రామాణికత

తానా ఆధ్వర్యంలో… “తెలుగు దిన పత్రికలు- తెలుగు భాష ప్రామాణికత” మీద చర్చాగోష్టి Advertisement ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో అంతర్జాల దృశ్య…

తానా ఆధ్వర్యంలో… “తెలుగు దిన పత్రికలు- తెలుగు భాష ప్రామాణికత” మీద చర్చాగోష్టి

ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) సాహిత్య విభాగం “తానా ప్రపంచ సాహిత్య వేదిక” ఆధ్వర్యంలో అంతర్జాల దృశ్య సమావేశంలో “తెలుగు దినపత్రికలు- తెలుగు భాష ప్రామాణికత” అనే అంశంపై జరిపిన చర్చా కార్యక్రమం విజయవంతం అయింది.

తానా అధ్యక్షులు తాళ్లూరి జయశేఖర్ ప్రారంభోపన్యాసం చేస్తూ “తెలుగు భాషను పరిరక్షించుకోవటానికి పత్రికలు చేస్తున్నకృషి ఎంతో శ్లాఘనీయమైనదని, తెలుగు భాషా సాహిత్యాల కోసం తానా నిరంతరం కృషి చేస్తుందని” అన్నారు.

తానా ప్రపంచ సాహిత్య వేదిక సమన్వయకర్త చిగురుమళ్ళ శ్రీనివాస్ అతిదులందరకి ఆహ్వానం పల్కుతూ ఇది చాలా ప్రయోజనకరమైన చర్చ అన్నారు. 

తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. తోటకూర ప్రసాద్ మాట్లాడుతూ – భాషా పరిపుష్టి కోసం తెలుగు పత్రికలు నిర్వహించిన, నిర్వహిస్తున్న పాత్ర గురుతరమైనది అన్నారు. 

అన్ని ప్రాంతాలవారికి ఆమోదయోగ్యమైన, అనుసరించదగ్గ, జన బాహుళ్యంలోకి ఎక్కువగా చొచ్చుకు పోగల్గే తెలుగు పద సృష్టి జరగవలసిన అవసరం ఉందని, ఈ కృషిలో ప్రభుత్వాలు, తెలుగు అకాడమీలు, సాహిత్య అకాడమీలు ఎక్కువ దృష్టి పెట్టాలని, వాటిని ప్రజల్లోకి తీసుకు వెళ్లేందుకు తెలుగు దినపత్రికలు అత్యంత ప్రతిభావంతమైన పాత్రను పోషిస్తాయన్నారు. 

అందుకే “తెలుగు దినపత్రికలు – తెలుగు భాష ప్రామాణికత” అనే అంశం పై తమ విశేష అనుభావాలను, అభిప్రాయాలను పంచుకోవలసినదిగా వివిధ దిన పత్రికల సంపాదకులను కోరగా అందరూ ఉత్సాహంగా ఒకే వేదికమీదకు రావడం ఆహ్వానించదగ్గ పరిణామం అన్నారు.    

ఈ కార్యక్రమంలో విశిష్ట అతిధులుగా పాల్గొన్న “మన తెలంగాణ” దినపత్రిక సంపాదకులు శ్రీ గార శ్రీరామమూర్తి మాట్లాడుతూ “కొత్త పదాల సృష్టించే క్రమంలో వాటిని సంక్లిష్టం చేయటం మంచిదికాదని, దాని వలన భాష జనానికి దూరం అయ్యే ప్రమాదం ఉందని, ఎక్కువ మంది వాడే పదాలను పత్రికలు వాడితే ఎక్కువ ప్రయోజనం కలుగుతుందని అభిప్రాయపడ్డారు.” 

“ఎ. పి. కాలేజ్ ఆఫ్ జర్నలిజం” వ్యవస్థాపకులు శ్రీ సతీష్ చందర్ మాట్లాడుతూ “భాషలో ఎదిగి మాట్లాడటం, ఒదిగి మాట్లాడటం ఉంటాయి. ఇతర భాషల్లోని శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పదాలకు భాషా వేత్తలు కొత్త పదాలను సృష్టించలేరు, ఆ సాంకేతిక రంగాల్లో ఉన్న వారు మాత్రమే ఈ పదాలను సృష్టించగలరు అన్నారు.”

“ఆంధ్రజ్యోతి” దినపత్రిక సంపాదకులు కె. శ్రీనివాస్ మాట్లాడుతూ “వాడుక భాష వేరు. శాస్త్రవిజ్ఞాన భాష వేరు. వాడుక భాష ప్రామాణిక భాష కాలేదు. అచ్చ తెలుగు మాటలతో ప్రామాణికతను సాధించలేము. ఒక కొత్త పదానికి అర్థం నిఘంటువులో లేకపోతే దానికి ప్రామాణిక లేనట్లే అనుకోవాలి, అందువలన నిఘంటువు నిర్మాణాలు విరివిగా జరగాల్సిన అవసరం ఎంతైనా ఉంది అన్నారు.” 

“ఈనాడు” దినపత్రిక సంపాదకులు ఎం. నాగేశ్వరావు మాట్లాడుతూ “మాతృభాషలో పిల్లలకు పునాదులు వేయాల్సిన అవసరం ఉంది. భారతీయ భాషలు అనేకం హలంత భాషలు. తెలుగు హజంత భాష. దీన్ని దృష్టిలో పెట్టుకుని అనేక పదాలను రామోజీ ఫౌండేషన్ ద్వారా సృష్టిస్తున్నామన్నారు. 

“సాక్షి” దినపత్రిక సంపాదకులు దిలీప్ రెడ్డి మాట్లాడుతూ “ప్రసార మాధ్యమాల్లో లక్ష్యాలు సాధించాలంటే ప్రామాణిక భాష ఉండాలి. ప్రామాణిక భాష ప్రజా ఆమోదయోగ్యంగా ఉండాలి. ఎక్కువ మంది  అంగీకరించిన భాష ప్రామాణిక భాష అవుతుంది. పత్రికలు భాషను నిరంతరం కాపాడుతూ వస్తున్నాయన్నారు.”

ఆద్యంతం ఆసక్తిగా సాగిన ఈ చర్చా కార్యక్రమ విజయంలో తోడ్పడిన వారందరికీ, పాల్గొన్న విశిష్ట అతిధులందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, భాషా పరిరక్షణ కోసం ఇటువంటి మరిన్ని ప్రయోజనకర చర్చాకార్యక్రమాలు జరుపుతామని తానా ప్రపంచ సాహిత్య వేదిక నిర్వాహకులు డా. ప్రసాద్ తోటకూర తెలియజేశారు.