నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లలో అల్లు అరవింద్, దగ్గుబాటి సురేష్ బాబుల తరువాత స్టార్ స్టేటస్ అందుకున్నది దిల్ రాజు నే. మిడిల్ ఏజ్ లో తనకు సంబంధం లేని సినిమా ఇండస్ట్రీలోకి ఏ వారసత్వం లేకుండా ఎంటరై, బహుముఖంగా విస్తరించి, ఈ రోజు ఇండస్ట్రీని శాసించే శక్తుల్లో ఒకరిగా ఎదిగారు.
ఇది ఒకవైపు, యాభై ఏళ్లు రాకుండానే భార్యా వియోగం సంభవించి, వ్యక్తిగతంగా గట్టిదెబ్బతిన్నారు. ఇది మరో వైపు. రోజుకు పద్దెనిమిది గంటలు శ్రమిస్తూ, అర్థరాత్రి దాటాక ఇంటికి చేరేది పలకరించేది ఎవరు? ఇది వేరే కోణం.
ఇలాంటి నేపథ్యంలో ఆయన కూతురు, అల్లుడే కలుగ చేసుకుని, మళ్లీ పెళ్లి చేసుకోమని వత్తిడి చేయడం, ఆయనకు పరిచయం వున్న మహిళతోనే సంబంధం సెట్ చేయడం జరిగిపోయింది. ఈ విషయాన్ని గ్రేట్ ఆంధ్రనే ముందుగా వెల్లడించింది.
కానీ లేటెస్ట్ సంగతి ఏమిటంటే, ఈ విషయంలో తాము కూడా ఏదో ఒకటి బ్రేక్ చేయాలనో, లేదా మరోటనో ఉద్దేశంతో ఏకంగా దిల్ రాజుకు పెళ్లి జరిగిపోయింది అనే వార్తలు పుట్టుకువచ్చేసాయి.
ఈ వార్తలకు దిల్ రాజు చాలా హర్ట్ అయినట్లు బోగట్టా. మరీ ఇంత దొంగచాటుగా పెళ్లి చేసుకోవాల్సినంత ఖర్మ పట్టలేదు అంటూ ఆయన తన సన్నిహితుల దగ్గర బాధపడినట్లు తెలుస్తోంది. తాను పెళ్లి చేసుకోవడానికి కొన్ని రోజుల ముందే అందరికీ చెప్పి చేసుకుంటానని, అందరినీ ఆహ్వానించే చేసుకుంటానని ఆయన చెబుతున్నారని బోగట్టా. ఇలా దొంగచాటుగా చేసుకోవడం తప్ప మరో మార్గం లేదనుకుంటే అస్సలు చేసే చేసుకోనని ఆయన తెగేసి చెబతున్నట్లు తెలుస్తోంది.
యాభై ఏళ్ల వయసు, మంచి ఆరోగ్యం, ఫిట్ నెస్ మీద శ్రద్ద, కీలకంగా వ్యాపారాలు చేసుకుంటూ హుషారుగా వున్న దిల్ రాజు మళ్లీ పెళ్లి చేసుకోవడం తప్పు కాదు. ఆ వార్త తెలిసి వెల్లడించడం అంతకన్నా తప్పు కాదు. కానీ సరైన ఆధారం లేకుండా దొంగచాటుగా పెళ్లి చేసుకున్నారని వార్తలు పుట్టించడం అంటే కాస్త ఆలోచించాలేమో?