చంద్రబాబునాయుడు ఒకవైపు ప్రజాచైతన్య యాత్రలు చేస్తున్నారు. రాజధాని అనేది అమరావతిలో మాత్రమే ఒక్కచోటే ఉండాలనే డిమాండ్ తో ఆ ప్రాంత రైతులు దేశంలోని పుణ్యక్షేత్రాల యాత్రలు చేస్తున్నారు. అమరావతిని రాజధానిగా ప్రకటించిన నేపథ్యంలో.. అక్కడ భూములున్న వాళ్లంతా హఠాత్తుగా కుబేరులు అయిపోయారు.. వారు దేశాటనమే కాదు కదా.. విదేశీయాత్రలు కూడా చేయగలరు. అది వారిష్టం. కానీ.. ప్రతి పుణ్యక్షేత్రానికి వెళ్లినప్పుడు అమరావతి ప్లకార్డులతో ఓ ఫోటో దిగి.. జగన్ కు సద్బుద్ధి కలగాలని, రాజధాని అమరావతినుంచి తరలిపోకూడదని వేడుకున్నట్లుగా ఒక బిల్డప్ ఇస్తున్నారు. అమరావతిని నెత్తిన పెట్టుకుంటున్న మీడియా.. అక్కడికేదో అద్భుతం జరిగిపోయినట్లుగా.. వాటిని ప్రముఖంగా ప్రచురిస్తోంది. ఇలాంటి డ్రామాలకు అంతూపొంతూ లేకుండాపోతోంది.
తాజాగా అమరావతి ప్రాంత రైతులు… గౌతమ బుద్ధుడు తొలి ధర్మోపదేశాన్ని ఇచ్చిన ప్రదేశం ఉత్తరప్రదేశ్ లోని సారనాథ్ కు వెళ్లారు. పట్టుమని ఇరవైమంది కూడా లేరు. చూడబోతే వారంతా కలిపి తీర్థయాత్రలకు వెళుతున్నట్లుగా ఉంది. పార్కులోని ఒక బుద్ధ విగ్రహం ఎదుట అమరావతి ప్లకార్డులు పట్టుకుని ఫోటో దిగారు. ర్యాలీగా తిరిగి.. అక్కడి బౌద్ధ భిక్షువులందరికీ అమరావతి గురించి వివరించారుట! జగన్ కు మంచి బుద్ధి ఇవ్వాలని తథాగతుడికి విన్నవించుకున్నారుట.
హాస్యాస్పదంగా కనిపించే ఇలాంటి డ్రామాలు ఇవాళ కొత్త కాదు. సారనాధ్ మొదటి పుణ్యక్షేత్రం కాదు. అమరావతి ప్రాంత రైతులు ఏ తీర్థయాత్రకు వెళ్లదలచుకున్నా.. దానికి అమరావతి పరిరక్షణ ముసుగు తొడుగుతూ.. ఉద్యమస్పూర్తిని పలుచన చేసేస్తున్నారు. మేడారం జాతర, షిరిడి, గోదావరి జిల్లాలో ఒక చర్చి ఇలా ఎవరికి తోచిన పుణ్యక్షేత్రానికి వారు వెళుతూ.. అక్కడ అమరావతి గురించి దేవుడిని వేడుకున్నట్లుగా చాటుకుంటున్నారు. ఇలాంటి డ్రామాల వల్ల ఫలితం ఏంటి?
నిజంగానే వారికి ఊర్లు తిరిగి పోరాడాలని, తమ అమరావతి డిమాండు పట్ల నలుగురి దృష్టి ఆకర్షించి సమస్య పరిష్కరించుకోవాలని ఉంటే గనుక.. అచ్చంగా.. అందరూ కలిసి ఢిల్లీ వెళ్లాలి. రాష్ర్టపతినో, ప్రధానినో కలసి కష్టం చెప్పుకోవాలనే డిమాండ్ తో జంతర్ మంతర్ వద్దే నిరవధిక ధర్నాలకు ఉపక్రమించాలి. అది క్రియాశీలత అవుతుంది. అలాంటి ప్రయత్నాలు చేయకుండా ఇలాంటి డ్రామాలతో ఏం ఒరుగుతుంది?