రాజ్యసభ ఎన్నికల షెడ్యూల్ విడుదల అయ్యింది. మార్చి ఆరో తేదీన అందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కాబోతూ ఉంది. మార్చి 13వ తేదీలోగా నామినేషన్లను దాఖలు చేయాల్సి ఉంటుందని షెడ్యూల్ లో పేర్కొన్నారు. రాజ్యసభ ఎన్నికలు మరీ పోటాపోటీ గా ఉండేవీ కావు. ఏపీ విషయానికి వస్తే.. అంతా ఏకగ్రీవమే. తెలుగుదేశం పార్టీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికల గురించి ఆలోచించే పరిస్థితుల్లో కూడా లేదు. ఉన్న వారినే చంద్రబాబు నాయుడు బీజేపీలోకి పంపించారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి, అది వేరే కథ.
ఆ సంగతలా ఉంటే.. ఏపీలో కోటాలో ఖాళీ అయ్యే నాలుగు స్థానాలూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే దక్కబోతున్నాయనేది తెలిసిన విషయమే. దీంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలం రెండు నుంచి ఆరుకు పెరగబోతూఉంది రాజ్యసభలో. ఇలాంటి క్రమంలో ఇంతకీ వైసీపీ తరఫున నామినేట్ అయ్యే ఆ నలుగురు నేతలు ఎవరనేది సర్వత్రా ఆసక్తిదాయకంగా మారింది. అయితే ఇప్పటి వరకూ ఆ పార్టీ అధికారికంగా కానీ, అనధికారికంగా కానీ అందుకు సంబంధించి లీకులు కూడా ఇవ్వడం లేదు!
బయట అయితే ఐదారు మంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి. అయితే అన్నీ ఊహాగానాలు మాత్రమే. కాస్తో కూస్తో ఆయోధ్య రామిరెడ్డికి మాత్రమే వైఎస్ జగన్ నుంచి హామీ వచ్చిందనే మాట వినిపిస్తూ ఉంది. మిగతా పేర్లన్నీ మీడియా లో జనరేట్ అయినవి మాత్రమే. ఆ ఊహాగానాల విషయానికి వస్తే.. చిరంజీవి, వైఎస్ షర్మిల వంటి అనూహ్యమైన పేర్లతో మొదలుపెడితే, ఎమ్మెల్సీ హోదాలతో పాటు మంత్రి హోదాలను కోల్పోబోతున్న పిల్లి సుభాష్ చంద్రబోస్,మోపిదేవి వంటి వాళ్ల పేర్ల వరకూ వినిపిస్తూ ఉన్నాయి. ఇంతకీ వైసీసీ తరఫున రాజ్యసభ కు నామినేట్ అయ్యేదెవరనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్సే!