టి.సుబ్బరామిరెడ్డి… రాజకీయాలతో సంబంధాలున్న వ్యాపారవేత్త, కళారంగంతో సన్నిహిత సంబంధాలున్న రాజకీయ నేత… ఇలా ఎన్ని రకాలుగా చెప్పినా ఈ రెడ్డిగారి గురించి తక్కువే! తన ఇంట్లో పెళ్లి జరిగితే బాలీవుడ్ కింగ్ ఖాన్ ను డ్యాన్సర్ గా పెట్టి స్టెప్పులు వేయించిన స్టామినా ఉన్న వ్యక్తి! రెడ్డిగారు ఇచ్చే పార్టీ అంటే..దానికి ఢిల్లీ కూడా కదిలి వస్తుంది! సోనియాగాంధీ కూడా రెడ్డిగారి ఇంటికి అతిథిగా వచ్చేదంటే.. కాంగ్రెస్ లో అయితేనేం, అప్పటి ప్రభుత్వం లో అయితేనేం సుబ్బరామిరెడ్డి స్టామినా ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
అలాగని ప్యూర్ పొలిటీషియన్ కాదు. కాంగ్రెస్ వాళ్లలో ఎంతమంది సుబ్బరామిరెడ్డికి సన్నిహితులో, ఇతర పార్టీల్లో కూడా అంతే మంది సన్నిహితులుంటారు. ఒక రాజకీయాలతో సంబంధం లేని సినిమా వాళ్లతో అయితే కళాబంధుకు ఉన్న బంధం అలాంటిలాంటిది కాదు! ఏవో ఒక అవార్డులు ఇస్తూనే ఉంటారు, ఎవరో ఒకరికి సన్మానాలు చేస్తూనే ఉంటారు, ఏ రెండు మూడు నెలలకు ఒకసారి సినిమా వాళ్లకు బిరుదులు, సత్కారాలు రెడ్డిగారికి రొటీనే! ఇప్పుడు తేడా ఏమిటంటే.. టి.సుబ్బరామిరెడ్డి రాజ్యసభ సభ్యత్వకాలం ముగుస్తూ ఉంది!
చాలా కాలంగా సుబ్బరామిరెడ్డి ఢిల్లీలో ఏదో ఒక హోదాతో ఉంటూ వస్తున్నారు, కేంద్రమంత్రి, రాజ్యసభ సభ్యుడు, కాంగ్రెస్ ట్రెజరర్ లలో ఒకరిగా ఉంటూ వస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు సుబ్బరామిరెడ్డిని మరోసారి రాజ్యసభకు నామినేట్ చేసే స్థితిలో లేదు. ఒకవేళ ఇప్పటికే జగన్ వద్దకు చేరి ఉంటే ఈయన అక్కడా పదవిని సంపాదించుకునే వాళ్లేనేమో! లోక్ సభ ఎన్నికలకు ముందే సుబ్బరామిరెడ్డి వైసీపీలో చేరతారు అని, విశాఖ నుంచి ఎంపీగా పోటీ చేస్తారని వార్తలు వచ్చాయి. అయితే అవేం జరగలేదు.
ఇక ఇప్పటికిప్పుడు వైసీపీలోకి చేరి, నామినేషన్ పొందే పరిస్థితి అయితే కనిపించడం లేదు. అక్కడా ఇప్పుడు పోటీ గట్టిగానే ఉంటుంది. మరి ఇంతటితో కళాబంధు రాజకీయ ప్రస్థానం ముగిసినట్టేనా? రెడ్డిగారు ఇంతటితో వదిలేస్తారా?