అమరావతి ప్రాంతంలో రైతులనుంచి సేకరించిన భూమిలో 1251 ఎకరాలను పేదల ఇళ్ల స్థలాలకు కేటాయిస్తూ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అర్హులైన పేదలకు ఒక్కొక్కరికి ఒక సెంటు స్థలం వంతున కేటాయిస్తారు. మొత్తం 54307 మందికి ఇంటిస్థలాలు దక్కుతాయి. సీఆర్డీయే లేఅవుట్లు అభివృద్ధి చేసిన తర్వాత.. ఒకేతరహాలో ఉండేలాగా ఇళ్లు నిర్మిస్తారు. అయితే.. రాజధాని ప్రాంతంలో సేకరించిన భూమిని పేదలకు ఇంటిస్థలాలుగా కేటాయించాలనే ఆలోచన మీద కొన్ని రోజులుగా రాద్ధాంతం జరుగుతున్న నేపథ్యంలో లీగల్ చిక్కులు రాకుండా ముందుజాగ్రత్త చర్యలతోనే ప్రభుత్వం ఆదేశాలు జారీచేసినట్లు కనిపిస్తోంది.
ఇంటిస్థలాల కేటాయింపులో ప్రభుత్వంచాలా భారీగా వ్యవహరించింది. దానికి తోడు కేవలం అమరావతి ప్రాంతంలో ఉంటున్న పేదలకు మాత్రమే కాకుండా, అక్కడకు చాలా దూరంగా ఉండే గుంటూరు జిల్లాలోని ఇతర ప్రాంతాలు పెదకాకాని, మంగళగిరి, దుగ్గిరాల, తాడేపల్లి మండలాల వారికి కూడా ఇక్కడ కేటాయించారు.
అలాగే విజయవాడ కార్పొరేషన్ పరిధిలోకి వచ్చే పేదలు పలువురికి కూడా ఇక్కడే స్థలాలు ఇచ్చారు. సహజంగానే ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత.. దాని గురించి యాగీ చేయడానికి విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. రైతులు ఇచ్చిన భూముల్ని పేదల ఇళ్లస్థలాలకోసం ఇవ్వడం కుదరదని, దీనిపై న్యాయపోరాటం చేయబోతున్నామని తెలుగుదేశం ఇప్పటికే ప్రకటించింది.
అయితే ప్రతిపక్షాలు ఇలా కోర్టును ఆశ్రయిస్తాయనే ఊహతో, ముందుజాగ్రత్తగానే ప్రభుత్వం జీవోను సిద్ధం చేసినట్లు కనిపిస్తోంది. భూ సమీకరణలో తీసుకున్న మొత్తం భూమిలో కనీసం 5 శాతం భూమిని పేదలకు గృహనిర్మాణం కోసం అందుబాటులో ధరలో కేటాయించాలని సిఆర్డిఏ చట్టంలో ఉన్న 53 (డి) నిబంధన ఆధారంగా ఈ కేటాయింపు ఉత్తర్వులు ఇస్తున్నట్లుగా జీవోలో పేర్కొన్నారు. తెదేపా సర్కారు రూపొందించిన సీఆర్డీయేచట్టం నిబంధనలనే కోట్ చేస్తూ జీవో రావడం.. ముందుజాగ్రత్తగా కనిపిస్తోంది.
అయితే జగన్ సర్కారు సీఆర్డీయే చట్టాన్ని రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసింది. మండలి అడ్డుపుల్ల వలన ఆ రద్దు నిర్ణయం ఇంకా అమల్లోకి రాలేదు. ఈ నేపథ్యంలో ఆ చట్టంలోని నిబంధనలను కోట్ చేస్తూ కేటాయింపులు జరిపితే.. వాటి పర్యవసానం ఎలా ఉంటుంది? అనేది మాత్రం సందేహంగానే ఉంది. ఈ కేటాయింపులు న్యాయపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల అనే అనుమానం కొందరిలో ఉంది.