ఆ సినీ సెల‌బ్రిటీల‌కు కొంచెం అయినా సిగ్గుండాలి

అస‌లే వేస‌వి తాపం, చేతి నిండా డ‌బ్బు …హాయిగా జ‌ల‌కాలాట‌ల‌లో అంటూ జీవితాన్ని ఆస్వాదించాల‌ని కోరిక పుట్ట‌డం స‌హ‌జం. అయితే దేనికైనా స‌మ‌యం, సంద‌ర్భం ఉండాలి క‌దా? అనేది హిందీ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ…

అస‌లే వేస‌వి తాపం, చేతి నిండా డ‌బ్బు …హాయిగా జ‌ల‌కాలాట‌ల‌లో అంటూ జీవితాన్ని ఆస్వాదించాల‌ని కోరిక పుట్ట‌డం స‌హ‌జం. అయితే దేనికైనా స‌మ‌యం, సంద‌ర్భం ఉండాలి క‌దా? అనేది హిందీ న‌టుడు న‌వాజుద్దీన్ సిద్ధిఖీ వాద‌న. 

దేశం క‌రోనా విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో ఉంటే, జ‌నాలు వైద్యానికి, ఉపాధికి నోచుకోక ఆర్త‌నాధాలు చేస్తుంటే …డ‌బ్బును నీళ్ల‌లా ఖ‌ర్చు చేయ‌డంపై న‌వాజుద్దీన్ తీవ్ర ఆవేన‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తుండ‌డం అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

ఇటీవ‌ల కాలంలో ముఖ్యంగా మ‌హిళా సినీ సెల‌బ్రిటీలు, మ‌రికొన్ని జంట‌లు విహార యాత్ర‌ల‌కు వెళుతూ, అక్క‌డ వ‌య్యారాలు పోతూ తీసుకున్న ఫొటోల‌ను సోష‌ల్ మీడియాలో షేర్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. 

శ్రద్ధా కపూర్‌, మాధురీ దీక్షిత్‌, జాన్వీ కపూర్‌, రణ్‌బీర్‌ కపూర్‌-ఆలియా భట్‌, టైగర్‌ ష్రాఫ్‌-దిశా పటానీ తదితరులు మాల్దీవులు వెళ్లొచ్చారు. న‌వాజుద్దీన్‌కు ముందే మ‌రికొంద‌రు కూడా వీరి విహార‌యాత్ర‌ల‌పై మండిపడ్డారు. తాజాగా న‌వాజుద్దీన్ కూడా వ్య‌తిరేకించిన వారి జాబితాలో చేరారు.

న‌వాజుద్దీన్ ట్వీట్‌ను ఒక‌సారి గ‌మ‌నిస్తే …ఆయ‌న ఆగ్ర‌హంలోని స‌హేతుక‌త ఏపాటిదో అర్థం చేసుకోవ‌చ్చు.

‘ప్రపంచమంతా కరోనా సంక్షోభంలో పడింది. వీళ్లు మాత్రం విహార యాత్రలకు వెళుతున్నారు. మాల్దీవుల్లో ఎంజాయ్‌ చేస్తూ, ఫొటోలను షేర్‌ చేయటంలో బిజీగా ఉన్నారు. వీళ్లు చేసే తమాషా ఏంటో నాకు అర్థం కావటం లేదు. ప్రజలు తిండి దొరక్క ఇబ్బంది పడుతుంటే… డబ్బును నీళ్లలా ఖర్చు పెడుతున్నారు. కొంచెమైనా సిగ్గుండాలి’ అని ఆయన ఘాటుగా స్పందించడం గ‌మ‌నార్హం.