లాక్ డౌన్ పై కొత్త రూల్స్.. రూమర్స్ కు చెక్

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ అంటూ పుకార్లు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఆమధ్య దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు. మరీ ముఖ్యంగా 2వ తేదీ…

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో మరోసారి లాక్ డౌన్ అంటూ పుకార్లు వ్యాపిస్తూనే ఉన్నాయి. ఆమధ్య దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేసినప్పటికీ ఊహాగానాలు మాత్రం ఆగలేదు. మరీ ముఖ్యంగా 2వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా సంపూర్ణ లాక్ డౌన్ అమల్లోకి వచ్చేలా ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో పుకార్లు చెలరేగుతున్నాయి.

లాక్ డౌన్ అంశం తమ చేతుల్లో లేదని ఇప్పటికే కేంద్రం ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రతి రోజూ పరిస్థితిని సమీక్షిస్తూ రాష్ట్రాలే లాక్ డౌన్ పై విధివిధానాలు ఖరారు చేసుకోవాలని, నిర్ణయాలు తీసుకోవాలని చెప్పేసింది. ఈ నేపథ్యంలో లాక్ డౌన్ విధింపుపై కొన్ని కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది కేంద్రం.

నిన్న అర్థరాత్రి కేంద్రం కొన్ని కీలక సిఫార్సులు చేసింది. గడిచిన వారం రోజుల వ్యవథిలో పాజిటివ్ కేసుల సంఖ్య 10శాతానికి చేరితే మినీ లాక్ డౌన్ ఆంక్షల్ని కఠినంగా అమలు చేయాలని సూచించింది. దీంతో పాటు.. హాస్పిటల్స్ లో 60శాతానికి మించి ఆక్సిజన్ వినియోగం జరుగుతున్నా, ఐసీయూల్లో బెడ్స్ నిండిపోయిన సందర్భాల్లో కూడా స్పల్ప లాక్ డౌన్ ఆంక్షల్ని విధించాలని తెలిపింది.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట కర్ఫ్యూ అమల్లో ఉంది. దీని వల్ల సానుకూల ఫలితాలు వస్తున్నాయని అధికారులు చెబుతున్నప్పటికీ రోజువారీ పెరుగుతున్న కేసుల బట్టి చూస్తే ఇది చాలదంటున్నారు నిపుణులు. ఈ నేపథ్యంలో.. కేంద్ర సూచనల ఆధారంగా.. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో పగటిపూట కూడా పాక్షిక లాక్ డౌన్ ఆంక్షలు అమల్లోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

అయితే ఇంతకుముందులా కఠినంగా లాక్ డౌన్ ను అమలు చేయడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపించడం లేదు. దీనిపై ఇప్పటికే తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు విస్పష్ట ప్రకటన చేశారు. అయితే రాత్రివేళ కర్ఫ్యూతో పాటు.. పగటి పూట కూడా ఆంక్షలు విధించే అంశంపై మరో 3 రోజుల్లో నిర్ణయం తీసుకునే ఛాన్స్ ఉంది.