ఏ ఇండస్ట్రీలో అయినా అంతే… అందరూ సక్సెస్ వెంట పడి పరుగులు తీస్తూ ఉంటారు. సెంటిమెంట్లకు బాగా ప్రాధాన్యం ఉండే రాజకీయ రంగంలో కూడా పరిస్థితి అందుకు భిన్నమేమీ కాదు. ఇప్పుడు అందరూ పీకే వెంటపడి పరుగులు తీస్తున్నారు. కొంపదీసి మన పవన్ కల్యాణ్ వెంట.. అని భ్రమించొద్దు. రాజకీయ రంగంలో అడుగుపెట్టిన తర్వాత.. ఈ పదేళ్లలో ఆయన నమోదు చేసిన సక్సెస్ ఏమీ లేదు. అందరూ వెంటపడుతున్న పీకే.. ప్రశాంత్ కిశోర్. భాజపా వ్యతిరేక పార్టీలను జట్టుగా చేయడంలో.. వాటిని బలోపేతం చేయడంలో కృషి చేస్తున్న ప్రశాంత్ కిశోర్ సలహాలతో.. వచ్చే దఫా సొంతంబలంతోనే అధికారంలోకి రావడానికి కర్నాటకలో దేవేగౌడ- కుమారస్వామిలకు చెందిన జనతాదళ్ ఎస్ పార్టీ సిద్ధమైంది.
జనతాదళ్ ఎస్ గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రలోనే కనిష్టమైన స్థాయిలో సీట్లు గెలుచుకుని మూడో స్థానంలో నిలిచింది. అయినా సరే.. భాజపాను గద్దె ఎక్కనివ్వకూడదనే ఉద్దేశంతో కాంగ్రెస్ తో చేతులు కలిపి.. అధికారంలోకి వచ్చింది. అతి తక్కువ సీట్లు గెలిచిన పార్టీ నేత అయినా సరే.. కుమారస్వామి ముఖ్యమంత్రి అయ్యారు. తొలినాటినుంచి కాంగ్రెస్ తో అనేక చికాకులు భరించిన ఆయన ప్రభుత్వం ఊహించినట్లుగానే కుప్పకూలింది. అనంతరం భాజపా ఫిరాయింపుదార్లను తమలో చేర్చుకుని సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్సాటుచేసింది.
ఇప్పుడు జేడీఎస్ భవిష్య వ్యూహరచనలో నిమగ్నమైంది. కాంగ్రెస్ పట్ల కూడా విసిగిపోయి ఉన్న ఆ పార్టీ 2023 లో ఎన్నికల్లో సొంతబలంతో అధికారంలోకి రావాలని అనుకుంటోంది. అందుకే ప్రశాంత్ కిశోర్ సాయం తీసుకుంటోంది. ప్రశాంత్ కిశోర్ ను తమ పార్టీ పాలిట జిందా తిలిస్మాత్ గా భావిస్తోంది.
మరోవైపు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కూడా.. దేశవ్యాప్తంగా భాజపా వ్యతిరేక ప్రాంతీయ పార్టీలను ఏకం చేసే పనిలో ఉన్నారు. వచ్చే ఎన్నికల నాటికి మోడీ సర్కారు అంతు చూడాలన్నది ఆయన లక్ష్యమనే ప్రచారం కూడా ఉంది. అదే సమయానికి దేశంలోని దాదాపుగా అన్ని ప్రాంతీయ పార్టీలను ఏకం చేసి.. వాటికి తాను అనుసంధాన సూత్రంగా ఉండాలనే ఆలోచనతో పీకే పావులు కదుపుతున్నట్లుగా వాదనలు వినిపిస్తున్నాయి.
ఆ క్రమంలో భాగంగానే ఏపీలో వైకాపా లాగానే, ప్రస్తుతం తమిళనాడులో డీఎంకే మాదిరిగానే, కర్నాటకలో జేడీఎస్ తో ఆయన అడుగులు వేస్తున్నట్లుగా కనిపిస్తోంది. కానీ తమాషా ఏంటంటే.. ఈ రెండు పార్టీల ప్రజాబలానికి జేడీఎస్ కు చాలా తేడా ఉంది. మరి ఆ పార్టీని కూడా గద్దెమీదకు తేగలిగితే మాత్రం అది పీకే చేసిన అద్భుతమే అనుకోవాలి.