రాజధాని అమరావతిలో విలువైన భూమిని నిరుపేదల నివేశ స్థలాల కోసం పంపిణీ చేసేందుకు నిర్ణయించడమే కాదు…అందుకు తగ్గ ఉత్తర్వులను కూడా ఇచ్చింది. మొత్తం 54,307 మంది లబ్ధిదారులకు సెంటు భూమి చొప్పున రాజధానిలో 1,251.5065 ఎకరాల భూమిని కేటాయిస్తూ మునిసిపల్ పరిపాలన శాఖ జీవో నెంబరు. 107ని విడుదల చేసింది. జగన్ సర్కార్ వేసిన ఈ ఎత్తుగడతో ప్రతిపక్షాలతో పాటు రాజధాని రైతుల పేరుతో ఆందోళన బాట పట్టిన వాళ్లు చిత్తు అవుతున్నారు.
జగన్ సర్కార్ ఒక్క దెబ్బకు ఎన్నో పిట్టలు గిలగిలలాడుతున్నాయి. అమరావతి రాజధాని మురికివాడల ప్రదేశంగా మా రిపోతుందని ప్రతిపక్షాలు, అమరావతి రియల్టర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారంటే…పేదలకు నివేశ స్థలాలు ఇవ్వడాన్ని వాళ్లు ఎంతగా జీర్ణించుకోలేకున్నారో అర్థం చేసుకోవచ్చు.
సుమారు 54,307 మంది లబ్ధిదారులకు ఇంటి స్థలాలు ఇవ్వడం ద్వారా అమరావతిని ప్రజారాజధానిగా అవిష్కరించేందుకు జగన్ శ్రీకారం చుట్టినట్టైంది. అంతేకాదు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న పేదలకు పిలిచి మరీ విలువైన భూమిని ఇంటి స్థలంగా ఇస్తుండటంతో బలమైన ఓటు బ్యాంకును వైసీపీ నిర్మించుకుంటోందనే ఆవేదన, భయం కూడా ప్రతిపక్ష పార్టీల్లోనూ, ఆ పార్టీల సానుభూతి పరుల్లోనూ స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కో ఇంటిలో మూడు ఓట్లు చొప్పున లెక్క కట్టినా 1,62,921 ఓట్లు రాజధానిలో కొత్తగా వచ్చి చేరుతాయి.
రాజధాని 29 గ్రామాల్లో అంతా కలుపుకున్నా మహా అయితే 40 వేల నుంచి 50 వేల లోపు ఓట్లే. ఈ ఓట్లకు మూడింతల ఓట్లను వైసీపీ రాజధాని ప్రాంతంలో స్థిరమైన, నమ్మకమైనవి ఏర్పరచుకున్నట్టు అవుతోంది. కాగా ఎట్టి పరిస్థితుల్లో మార్చి 10వ తేదీలోపు ప్లాట్లు సిద్ధం చేయడంతో పాటు లాటరీ కూడా పూర్తి కావాలని ప్రభుత్వం ఆదేశించింది. మొత్తానికి పాలక పార్టీ నిర్ణయంతో మరీ ముఖ్యంగా టీడీపీ పరిస్థితి అగమ్యంగా తయారైంది. ఎందుకంటే పేదలకు ఇంటి స్థలం ఇస్తామంటే వ్యతిరేకించే పరిస్థితి ఉండదు. ఒకవేళ పేదలకు ఇంటి స్థలాల పంపిణీకి వ్యతిరేకంగా ఉద్యమిస్తే ఏం జరుగుతుందో ఆ పార్టీ నేతలకు తెలియంది కాదు.