మొత్డానికి ఓ వివాదం ముగిసిపోయింది. ఏనాడో ఇచ్చిన అడ్వాన్స్ కు సినిమా రాకపోయినా, వడ్డీ డబ్బులు కిట్టుబాటు అయ్యాయి. విషయం ఏమిటంటే మైత్రీ మూవీస్ సంస్థ ఏనాడో నాలుగున్నర కోట్లు అడ్వాన్స్ ఇచ్చింది దర్శకుడు త్రివిక్రమ్ కు. ఇవ్వాళ నిన్న కాదు, 2012-13 ఆ టైమ్ లో. అప్పట్లో ఇండస్ట్రీలోకి ఎంటర్ అయ్యే ఉద్దేశంతో చాలా మందికి అడ్వాన్స్ లు ఇచ్చారు. అలా అందుకున్నవారిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా వున్నారు. నాలుగు కోట్లు అడ్వాన్స్.
కానీ మైత్రీకి త్రివిక్రమ్ కు మధ్య గ్యాప్ వచ్చింది. ఎలా? అజ్ఞాతవాసి ఫ్లాప్ అయిన తరువాత మైత్రీ జనాలు నాని తో సినిమా తీయమని అడిగినట్లు బోగట్టా. వాస్తవానికి వారు అడ్వాన్స్ ఇచ్చింది మహేష్ తో తీయమని. అయితే మరోపక్క హారిక హాసినికి మహేష్ కు మద్య కమ్యూనికేషన్ చెడింది. వాళ్లు మహేష్ దగ్గర వున్న అడ్వాన్స్ వెనక్కు తెచ్చుకున్నారు.
ఆ విధంగా త్రివిక్రమ్-మహేష్ సినిమా పాజిబుల్ కాలేదు. అలాంటి టైమ్ లో త్రివిక్రమ్ ఇక తాను హారిక హాసినిలో తప్ప సినిమాలు చేయనని, అడ్వాన్స్ వెనక్కు ఇస్తానని చెప్పేసారు. కానీ మైత్రీ అధినేతలు ఊరుకోలేదు. వడ్డీలు, చక్రవడ్డీలు, బారువడ్డీలు అడిగారు. నిజానికి ఇండస్ట్రీలో ఇలాంటి వివాదాలు వున్నాయి కానీ, ఇలాంటి ట్రెండ్ లేదు. ఒక్క డివివి దానయ్య మాత్రమే రవితేజ, సునీల్, మారుతి లాంటి వాళ్ల దగ్గర అడ్వాన్స్ లకు అదనంగా తీసుకున్నారు.
ఇదిలా వుంటే అరవింద సమేత టైమ్ లో మైత్రీ నుంచి త్రివిక్రమ్ కు అడ్డంకులు ఎదురయయ్యాయి. అప్పట్లో నాలుగు కోట్లుకు బదులు ఎనిమిది కోట్లు, అంటే డబుల్ పేమెంట్ ఇస్తామని త్రివిక్రమ్-హారిక హాసిని వైపు నుంచి ప్రపోజల్ వెళ్లింది. కానీ వాళ్లు అంగీకరించలేదు. 12 కోట్లు ఇవ్వాలన్నారు. అక్కడ అలా ఆగిపోయింది.
ఇప్పుడు మళ్లీ ఎన్టీఆర్-త్రివిక్రమ్ సినిమా షురూ కాబోతోంది. అది స్టార్ట్ అయ్యేలోగా ఈ వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టాలని హారిక హాసిని చినబాబు, త్రివిక్రమ్ డిసైడ్ అయ్యారు. మంతనాలు నడిచాయి. ఆఖరికి 11 కోట్లు ఇవ్వడానికి, తీసుకోవడానికి అంగీకారం కుదిరినట్లు బోగట్టా. ఇది జరిగి పది రోజులు పైనే అయినట్లు తెలుస్తోంది.
అరవింద సమేత టైమ్ లో 8 కోట్లు ఇస్తాం అన్నారు. ఇప్పుడు 11 అయింది. అంటే ఈ గ్యాప్ లో కూడా వడ్డీ కట్టినట్లు అయింది,. అప్పట్లో 12 కావాలన్నారు మైత్రీ మూవీ మేకర్లు. కానీ ఇప్పుడు 11 తో సరిపెట్టుకున్నారు. ఒక విధంగా ఈ డీల్ ఇరు వర్గాలకు లాభమే.
కానీ విషయం ఏమిటంటే మైత్రీ నవీన్ ఇంకా ఒప్పుకోవడం లేదని, నాలుగు కోట్లకు ఏడు కోట్ల వడ్డీ చాలదని, టోటల్ గా 16 కోట్లు కావాలని పట్టుపడుతున్నారని ఇంకో వెర్షన్ వినిపిస్తోంది. ఒకటి మాత్రం వాస్తవం. గత పది రోజులగా ఈ విషయంలో సిట్టింగ్ లు మాత్రం జరుగుతున్నాయి.
కానీ ఇక్కడ చెప్పుకోవాల్సిన పాయింట్ ఏమింటంటే, మైత్రీ మూవీ మేకర్స్ కు ఇలాంటి వివాదమే మరోటి వుంది. దర్శకుడు బోయపాటితో. కానీ ఆయన మొండికేసి కూర్చున్నట్లు గ్యాసిప్ వుంది. ఏం చేసుకుంటారో చేసుకోండి, వడ్డీలు, చక్రవడ్డీలు లేవు, కావాలంటే సినిమా మాత్రమే చేస్తా అని ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పేసినట్లు తెలుస్తోంది.