సీఎం జగన్ ఢిల్లీ పర్యటన సత్ఫలితాలనే ఇస్తోంది. మూడు రాజధానుల ఏర్పాటు నిర్ణయం…ఎన్నెన్నో పరిణామాలకు దారి తీసింది. మరీ ముఖ్యంగా ఏపీ శాసనమండలి రద్దు వరకు వెళ్లింది. మండలిని రద్దు చేస్తూ ఏపీ శాసనసభ తీర్మానం చేసి ఢిల్లీకి పంపింది. ఇప్పుడా తీర్మానం కేంద్రం కోర్టులో ఉంది. ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఢిల్లీ వెళ్లి ప్రధాని మోడీ, కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా, ఇతర మంత్రులను కలిశాడు. ఏపీ సమస్యల పరిష్కారం కోరుతూ కేంద్రం పెద్దలకు విజ్ఞాపన పత్రాలు కూడా అందజేశాడు.
జగన్ వినతుల్లో మరీ ముఖ్యంగా మండలి రద్దు అంశం ప్రధానమైంది. జగన్ వినతిని ప్రధాని, హోంమంత్రి కూడా సీరియస్‌గా తీసుకున్నారని సమాచారం. ఇందులో భాగంగా మండలి రద్దు తీర్మానం వివిధ దశలు దాటుకుని ప్రస్తుతం కేంద్ర కేబినెట్ ముందుకు వెళ్లినట్టు విశ్వసనీయ సమాచారం. మండలి రద్దు ఫైల్ కదలికలు చూస్తుంటే జగన్‌కు కేంద్రం బాగా సహకరిస్తున్నదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
మండలి రద్దు వెంటనే అమల్లోకి వస్తే జగన్‌కు తాము పెద్ద గిఫ్ట్ ఇచ్చినట్టు అవుతుందని ప్రధాని, కేంద్ర హోంమంత్రి భావిస్తున్నారని సమాచారం. త్వరలో వైసీపీకి మరో నాలుగు రాజ్యసభ సీట్లు పెరగనున్నాయి. రాజ్యసభలో ఏ బిల్లు అయినా నెగ్గించుకోవాలని తగినంత బలం అవసరం. బీజేపీకి తగినంత సంఖ్యా బలం రాజ్యసభలో లేదు. దీంతో వైసీపీ సహకారం కూడా ఎంతో అవసరం ఉండటంతో…జగన్ వినతిని సానుకూల దృక్పథంతో చూడాలని కేంద్రం భావిస్తున్నట్టు ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి.
కేంద్ర కేబినెట్ చెంతకు వచ్చిన మండలి బిల్లుపై చర్చించి ఉభయ సభల్లో ప్రవేశ పెడతారు. మార్చి నాటికి మండలి రద్దు బిల్లును పార్లమెంట్ ఉభయ సభల్లో ఓకే చేయించుకుని, రాష్ట్రపతి ఆమోద ముద్ర వేయించాలనే పట్టుదలతో సీఎం ఉన్నాడు. ఆ దిశగానే కేంద్రం కూడా సహకరిస్తోంది. జగన్ అనుకున్నట్టు అంతా జరిగిపోతే విశాఖకు పరిపాలన రాజధాని తరలింపు మరెంతో దూరంలో లేదని చెప్పవచ్చు.