నందమూరి నట వారసులు జూనియర్ ఎన్టీఆర్, కల్యాణ్ రామ్ ఎంత అన్యోన్యంగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కల్యాణ్‌రామ్ కేవలం నటుడిగానే కాకుండా సినిమా నిర్మాత అని కూడా తెలిసిందే. తాత ఎన్టీఆర్ పేరుపై సొంత బ్యానర్‌ను కూడా ఏర్పాటు చేయడమే కాదు సినిమాలు కూడా తీశాడు. అతనొక్కడు, పటాస్, కిక్-2, ఇజం, జైలవకుశ తదితర సినిమాలను నిర్మించిన ఖ్యాతి కల్యాణ్‌రామ్‌ది.
తాతపై ఎంతో ప్రేమ, మమకారాలతో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ బ్యానర్‌ను ఇటీవల మూసివేశారని ఫిల్మ్‌నగర్‌లో టాక్ నడుస్తోంది. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నిర్మించిన చిత్రాలు ఎక్కువగా నష్టాలు తేవడంతో , బాధాకరమైనప్పటికీ బ్యానర్‌ను మూసివేయక తప్పలేదని చిత్ర వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. కల్యాణ్‌రామ్ తీసిన సినిమాల్లో జైలవకుశ మాత్రం లాభాలు తెచ్చి పెట్టింది.
అయితే ఎన్టీఆర్ బ్యానర్ మూసివేయడం వెనుక అన్నదమ్ముల మనసులో వేరే ఆలోచన లేకపోలేదు. ముఖ్యంగా కల్యాణ్‌రామ్‌ను మంచి నిర్మాతగా నిలబెట్టాలనే పట్టుదల తమ్ముడు జూ.ఎన్టీఆర్‌లో ఉంది. ఇద్దరూ కలిసి ఉమ్మడిగా సొంత బ్యానర్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిసింది. అన్నకోసం తమ్ముడు సొంత బ్యానర్ ఏర్పాటు చేస్తున్నాడని ఫిల్మ్‌నగర్ వర్గాలు చెబుతున్నాయి.
తన తర్వాత సినిమాను కల్యాణ్‌రామ్ నిర్మాతగా చేపట్టేలా జూనియర్ ఎన్టీఆర్ ప్లాన్ చేసినట్టు తెలిసింది. అది కూడా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా తీయాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఈ విషయాన్నిఇప్పటికే త్రివిక్రమ్ ప్రకటించారు కూడా. అయిననూ పోయిరావలె హస్తినకు అనే టైటిల్‌ను ఖరారు చేసినట్టు సమాచారం. అదీ అన్నమాట అన్నకు ప్రేమతో జూనియర్ ఎన్టీఆర్ ఇస్తున్న బహుమతి.