గతేడాది వచ్చిన కరోనాకే అతలాకుతలమయ్యాయి ఏపీలోని కొన్ని జిల్లాలు. అత్యథిక కేసులతో పాటు, అత్యధిక మరణాలు చవిచూశాయి. సెకెండ్ వేవ్ లో కూడా అవే జిల్లాలు రిపీట్ అవ్వడం బాధాకరం. అలా రెండోసారి కరోనా ప్రభావానికి గురైన జిల్లాల్లో గుంటూరు, చిత్తూరు, కర్నూలు జిల్లాలున్నాయి.
గతేడాది ఇవే జిల్లాల్లో కరోనా కోరలు చాచింది. ఈసారి కూడా ఈ జిల్లాలు దారుణంగా కరోనాకు గురయ్యాయి. చిత్తూరు జిల్లానే తీసుకుంటే, గడిచిన 24 గంటల్లోనే ఈ జిల్లాలో 1628 కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య ఇప్పటికే లక్ష దాటగా, మృతుల సంఖ్య వెయ్యికి దగ్గరవుతోంది.
అటు గుంటూరు, కర్నూలు జిల్లాల్లో కూడా కరోనా తీవ్రత పీక్ స్టేజ్ లో ఉంది. గడిచిన 24 గంటల్లో గుంటూరులో 1576 కేసులు, కర్నూలులో 1158 కేసులు నమోదయ్యాయి. కర్నూలులో మొత్తం కేసులు 72వేలు దాటగా.. గుంటూరులో కేసులు లక్షకు చేరువయ్యాయి.
వీటితో పాటు కరోనా సెకెండ్ వేవ్ లో బాగా ఇబ్బంది పడుతున్న జిల్లా శ్రీకాకుళం. ఇంకా చెప్పాలంటే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కంటే ఈ సరిహద్దు జిల్లాలోనే అత్యథిక కేసులు నమోదవుతున్నాయి.
గడిచిన 24 గంటల్లో శ్రీకాకుళంలో 1680 కొత్త కేసులు నమోదయ్యాయి. అటు నెల్లూరు, విశాఖపట్నం, అనంతపురంలో కూడా వెయ్యికి పైగా కేసులు నమోదవుతున్నాయి. మొత్తంగా చూసుకుంటే ఏపీలో గడిచిన 24 గంటల్లో 12634 కొత్త కేసులు నమోదయ్యాయి.