సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓ ముసలమ్మ వీడియోను తన గుండె పగిలిందని ప్రముఖ సంగీత దర్శకుడు తమన్ వాపోయారు. ఆ వీడియో తనలో ఓ ఆశయాన్ని రగిల్చిందని ఆయన చెప్పుకొచ్చారు.
నిత్యం చాలా వీడియోలు సోషల్ మీడియాలో అప్‌లోడ్ అవుతుంటాయి. కానీ వాటిలో చాలా తక్కువ వీడియోలు మాత్రమే మనసులను కదిలిస్తుంటాయి. అలాంటి చలనం కలిగించే వీడియో తమన్ కంట పడింది.
రోడ్డు పక్కన ఆకలితో అలమటిస్తున్న ఓ వృద్ధురాలికి ఆహారం, మంచి నీళ్లను తమిళనాడుకు చెందిన నెటిజన్ అందజేశాడు. కడుపు నింపుకుంటున్న ఆ క్షణంలో ముసలమ్మ ఆనందానికి అవధుల్లేవు. అయితే తన ఆకలి తీర్చిన నెటిజన్ రుణాన్ని తీర్చుకునేందుకు తన వద్దనున్న కొంత డబ్బును ఇచ్చే ప్రయత్నం చేసిందా అవ్వ. అయితే అవ్వ నుంచి డబ్బు తీసుకునేందుకు అతను నిరాకరించాడు. ఆ తర్వాత అతను అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ మొత్తం ఎపిసోడ్‌కు సంబంధించి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
ఆకలి తీర్చుకున్న ముసలవ్వ కళ్లలో ఆనంద భాష్పాలు ప్రతి ఒక్కర్నీ కదిలిస్తున్నాయి. సోషల్ మీడియాలో విస్తృతంగా చక్కర్లు కొడుతున్న వీడియో తమన్ కంట పడింది. ఆయన తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. ఈ సందర్భంగా తమన్ తన స్పందనను ట్విటర్ వేదికగా తెలియజేశారు. ఆ వృద్ధురాలి కళ్లలో ఆనందం, చిరునవ్వు ప్రతి ఒక్కరి హృదయాల్ని ద్రవింపచేస్తోందనేందుకు తమన్ ట్వీటే నిదర్శనం.
‘ఈ వీడియో చూసి నా గుండె పగిలింది. ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలన్న కొత్త ఆశయం తన మనసులో నాటుకుంది. నా కోరికకు త్వరలోనే నిజం చేస్తాను. దానికి తగిన ధైర్యాన్ని, బలాన్ని దేవుడు నాకు అందిస్తాడని ఆశిస్తున్నాను. కన్నీళ్లతో ఈ మెస్సేజ్ పెడుతున్నాను. మీరు కూడా దయచేసి ఆహారాన్ని వృథా చేయకండి. అవసరమైన వారికి దానిని అందించండి’ అని కోరారు.