థ్యాంక్స్ చెబుతూనే….ష‌ర్మిల వెట‌కారం

తెలంగాణ‌లో కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త ఉంద‌ని, టీఆర్ఎస్ స‌ర్కార్‌ను టార్గెట్ చేస్తే త‌ప్ప తాను నిల‌దొక్కోలేన‌ని వైఎస్సార్ త‌న‌య ష‌ర్మిల భావిస్తున్నారు. ఈ మేర‌కు ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర…

తెలంగాణ‌లో కేసీఆర్‌పై వ్య‌తిరేక‌త ఉంద‌ని, టీఆర్ఎస్ స‌ర్కార్‌ను టార్గెట్ చేస్తే త‌ప్ప తాను నిల‌దొక్కోలేన‌ని వైఎస్సార్ త‌న‌య ష‌ర్మిల భావిస్తున్నారు. ఈ మేర‌కు ఏ మాత్రం అవ‌కాశం చిక్కినా తెలంగాణ సీఎం కేసీఆర్‌పై తీవ్ర స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించ‌డానికి ష‌ర్మిల వెనుకాడ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో కేసీఆర్‌కు ష‌ర్మిల థ్యాంక్స్ చెప్ప‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. అలాగే ప‌నిలో ప‌నిగా కేసీఆర్‌ను ఆమె దెప్పి పొడ‌వ‌డాన్ని గ్ర‌హించొచ్చు.

తెలంగాణ‌లో క‌రోనా మ‌హ‌మ్మారి విజృంభిస్తున్న ప‌రిస్థితుల్లో ప్ర‌జ‌ల‌కు ఫ్రీగా వ్యాక్సిన్ వేయాల‌ని ష‌ర్మిల డిమాండ్ చేశారు. ఇదే సంద‌ర్భంలో కేసీఆర్ స‌ర్కార్ ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇవ్వ‌డానికి నిర్ణ‌యించింది. ఇందుకు సుమారు రూ.2,500 కోట్లు ఖ‌ర్చు అవుతుంద‌ని కేసీఆర్ ప్ర‌క‌టించారు.

తెలంగాణ‌లోని ప్ర‌తి ఒక్క‌రికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు నిర్ణ‌యం తీసుకున్న కేసీఆర్‌కు ష‌ర్మిల థ్యాంక్స్ చెప్పారు. ఈ సంద‌ర్భంగా కూడా కేసీఆర్‌కు ష‌ర్మిల ఓ మోస్త‌రు చుర‌క‌లు అంటించ‌డం గ‌మ‌నార్హం. ఈ సంద‌ర్భంగా ష‌ర్మిల మాట్లాడుతూ…

“చావు భయంతో చస్తున్న ప్రజలను అప్పులపాలు చెయ్యడం అమానుషం. ప్రజల మాట, మా మాట విని అందరికీ వ్యాక్సిన్ ఉచితంగా ఇచ్చేందుకు ఒప్పుకున్నందుకు కేసీఆర్ గారికి ధన్యవాదాలు. ఇప్పుడైనా మేల్కొని కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చి చచ్చి బతికిన వారిని ఆదుకోవాలని సర్కారుకు విజ్ఞప్తి ” అంటూ షర్మిల పేర్కొన్నారు. కృత‌జ్ఞ‌త‌లు చెప్ప‌డంలోనూ వెట‌కార‌మేనా అని టీఆర్ఎస్ శ్రేణులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నాయి.