శ్రీకాకుళం జిల్లా కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు ప్రతిపాదన దశాబ్దంగా నలుగుతూనే ఉంది. ఇక్కడ అణు విద్యుత్ కేంద్రం పెడితే కాలుష్యంతో పాటు అతి భయకరమైన ప్రమాదాన్ని కళ్ళ ముందే పెట్టుకున్నట్లు అవుతుందని పర్యావరణవేత్తలు, మేధావులు ఓ వైపు హెచ్చరిస్తున్నారు.
నాడు యూపీయే హయాంలో ఈ ప్రతిపాదన వస్తే గట్టిగా ఆందోళనలు చేసి వెనక్కి తగ్గేలా చూశారు. ఇపుడు మోడీ ప్రధాని అయ్యాక మరో మారు ఈ ప్రతిపాదనలకు కాళ్ళూ చేతులు వచ్చాయని అంటున్నారు.
దేశంలో అణు విద్యుతు కర్మాగారాలకు విదేశీ పెట్టుబడులను ఆహ్వానిస్తూ మోడీ సర్కార్ తాజాగా ఆమోదించిన సంగతిని కూడా వామపక్ష నేతలు గుర్తుచేస్తున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ఇపుడు భారత్ లో ట్రంప్ పర్యటన వెనక కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు విషయం కూడా ఉందని అంటున్నారు.
అమెరికాకు చెందిన బుక్ ఫీల్డ్ మేనేజ్మెంట్ సంస్థ ద్వారా కొవ్వాడలో అణు విద్యుత్ కేంద్రం ఏర్పాటు చేయాలన్నది ట్రంప్ ఆలోచనగా సీపీఎం విశాఖ జిల్లా నాయకుడు సీహెచ్ నరసింగరావు ఆరోపిస్తున్నారు. అందులో ట్రంప్ అల్లుడు జేర్డ్ కూస్నెర్ ప్రధాన భాగస్వామిగా ఉన్నారని అంటున్నారు.
దాంతో ట్రంప్ ఎలాగైనా కొవ్వాడలో అణు విధ్యుత్ ప్లాంట్ కోసం పట్టుబడుతున్నారని, ఆయనకు భారత్ మీద ప్రేమ కంటే అణు ప్లాంట్ మీద మోజే ఎక్కువని సీపీఎం నేత అంటున్నారు. ఆయన్ని తీసుకువచ్చి భారత్ లో సంబరాలు చేస్తున్న మోడీ ట్రంప్ వలలో పడితే తాము ఊరుకోమని ఆయన హెచ్చరిస్తున్నారు. మరి ట్రంప్ రాక వెనక ఇంత కధ ఉందా అని ఇపుడు అంతా చర్చించుకుంటున్నారు.
నిజానికి అణు విద్యుత్ ప్లాంటుల భద్రత అన్నది పెద్ద ప్రశ్న. అభివ్రుధ్ధి చెందిన దేశాలు కూడా వాటి భద్రత విషయంలో పూర్తిగా సన్నధ్ధంగా లేవు. అలాంటిది వెనకబడిన శ్రీకాకుళం జిల్లా మీద అణు కుంపటి మోపాలనుకుంటే మాత్రం అది ఉత్తరాంధ్రాలో పాటు, గోదావరి జిల్లాలను సైతం సర్వనాశనం చేస్తుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు. ట్రంప్ దొర అడుగులకు మడుగులు ఒత్తుతున్న మోడీ సర్కార్ కానీ తలవొగ్గితే ఉత్తరాంధ్రా జిల్లాల నెత్తిన అణు బాంబు పెట్టినట్లే మరి.