ఒకపక్క హారిక హాసినికి తప్ప వేరే బ్యానర్ కు సినిమాలు చేయకుండా నెట్టుకువస్తున్నారు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇఫ్పటికే మైత్రీ మూవీస్ కు, డివివి దానయ్యకు చెరో సినిమా చేయాల్సి వుంది. ఆ మేరకు ఎప్పుడో అడ్వాన్స్ తీసుకున్నారు. మరి ఆ బాకీలు ఎప్పుడు తీరుతాయో తెలియదు.
రాబోయే సినిమాను కూడా హారిక హాసినికే చేస్తారని టాక్ వినిపిస్తోంది. ఇలాంటి నేపథ్యంలో కొద్దినెలల క్రితం ఆయన మరో బ్యానర్ దగ్గర కూడా అడ్వాన్స్ తీసుకున్నట్లు తెలుస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ బ్యానర్ అయిన నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ మీద ఓ సినిమా చేసేందుకు త్రివిక్రమ్ కొద్దినెలల క్రితం కాస్త పెద్ద మొత్తంలోనే అంటే కోట్లలోనే అడ్వాన్స్ తీసుకున్నారని తెలుస్తోంది.
అయితే ఈ అడ్వాన్స్ ఎన్టీఆర్ తో లేదా కళ్యాణ్ రామ్ తో అనేకాదు, త్రివిక్రమ్ ఎవరితోనైనా ఓ ప్రాజెక్టును ఆ బ్యానర్ కు చేయడానికి గాను ఇచ్చినట్లు తెలుస్తోంది. కానీ ఇప్పట్లో త్రివిక్రమ్ ఆ సినిమా చేసే అవకాశం వుందా అన్నది అనుమానం.