సాక్షిలో కాదు…ఆస్ప‌త్రుల్లో బెడ్స్ ఏవీ?

రోజురోజుకూ కోవిడ్ త‌న విశృంఖ‌ల‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. దీంతో రోగుల సంఖ్య అంత‌కంత‌కూ రెట్టింపై క‌నీసం ఆస్ప‌త్రిలో చేరేందుకు బెడ్స్ దొర‌క‌ని ద‌య‌నీయ స్థితి. కానీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి సంబంధించి సాక్షి దిన‌ప‌త్రిక‌లో మాత్రం…

రోజురోజుకూ కోవిడ్ త‌న విశృంఖ‌ల‌త్వాన్ని ప్ర‌ద‌ర్శిస్తోంది. దీంతో రోగుల సంఖ్య అంత‌కంత‌కూ రెట్టింపై క‌నీసం ఆస్ప‌త్రిలో చేరేందుకు బెడ్స్ దొర‌క‌ని ద‌య‌నీయ స్థితి. కానీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి సంబంధించి సాక్షి దిన‌ప‌త్రిక‌లో మాత్రం అర ల‌క్ష‌కు పైగా బెడ్స్ ఖాళీ ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ రోజు సాక్షి దిన‌ప‌త్రిలో “అందుబాటులో అర‌ల‌క్ష బెడ్స్” శీర్షిక‌తో ఓ క‌థ‌నం ప్ర‌చురిత‌మైంది.

ఆస్పత్రులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్లలో క‌లిపి మొత్తం 50,751 పడకలు ఖాళీగా ఉన్నాయ‌నే స‌మాచారం మ‌న‌సుకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. అయితే కాసేప‌టి క్రితం విజ‌య‌వాడ జీజీహెచ్ ఆస్ప‌త్రి ఎదుట క్యూ కట్టిన ఆరు అంబులెన్స్‌ల విజువ‌ల్స్ న్యూస్ చాన‌ళ్ల‌లో చూసి హృద‌యం ద‌హించుకుపోతోంది.

జీజీహెచ్ ఆస్ప‌త్రిలో కోవిడ్ రోగుల‌కు బెడ్స్ ఖాళీ లేక‌పోవ‌డంతో అంబులెన్స్‌ల‌లోనే రోగులు ఎదురు చూడాల్సిన ద‌య‌నీయ స్థితి క‌ళ్లెదుటే క‌నిపిస్తోంది. దీంతో ఆస్ప‌త్రి బ‌య‌ట అంబులెన్స్‌ల‌లో రోగుల‌కు త‌క్ష‌ణ వైద్యం అందిస్తున్న విజువ‌ల్స్ చూస్తుంటే …. ప్ర‌భుత్వ అనుకూల ప‌త్రిక బ్యాన‌ర్ క‌థ‌నంలో వెల్ల‌డించిన వివ‌రాల్లో వాస్త‌వం …నేతి బీరకాయ‌లో నెయ్యి చంద‌మ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డింది.

ఒక వైపు ఆస్ప‌త్రిలో బెడ్లు లేక రోగులు, వారి బంధువులు హాహాకారాలు చేస్తున్న హృద‌య విదార‌క ప‌రిస్థితి. మ‌రోవైపు జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌న సొంత మీడియా ద్వారా ఆహా, ఓహో అంటూ గొప్ప‌లు చెప్పుకోవ‌డం దేనికో అర్థం కాదు. సాక్షిలో నేడు రాసిన క‌థ‌నం ప్ర‌కారమే చెప్పుకుంటే ఇదే కృష్ణా జిల్లాలో 26 కోవిడ్ ఆస్ప‌త్రుల్లో 2,412 ప‌డ‌క‌లు, అలాగే 316 ఐసీయూ ప‌డ‌క‌లు, రెండు కోవిడ్ కేర్ సెంట‌ర్ల‌లో 2,164 ప‌డ‌క‌లు ఖాళీగా ఉన్నాయి.

మ‌రి ఇన్ని ఖాళీలుంటే రోగుల‌ను ఆస్ప‌త్రుల వెలుప‌ల నిరీక్షించేలా చేయాల్సిన అవ‌స‌రం వైద్యుల‌కు ఎందుకొచ్చిన‌ట్టు? ఇది ఒక్క విజ‌య‌వాడ‌లోనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఇదే దుస్థితి. పలుకుబ‌డి ఉంటే త‌ప్ప క‌నీసం బెడ్ పొంద‌లేని ప‌రిస్థితి. ఆ బాధ అనుభ‌వించే వారికే తెలుస్తుంది.

చాలా రాష్ట్రాల‌తో పోల్చితే …ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కోవిడ్ రోగుల‌కు మెరుగైన సౌక‌ర్యాలు, ట్రీట్‌మెంట్ అందిస్తున్నారు. ఇందులో రెండో మాట‌కే చోటు లేదు. అలాగ‌ని సాక్షిలో రాసినంత స్థాయిలో ఏర్పాట్లు లేవ‌నేది నిష్టుర స‌త్యం. ఎవ‌రిని మ‌భ్య పెట్ట‌డానికి ఇలాంటి రాత‌లు రాస్తున్నారో అర్థం కాదు. 

ఇలాంటి రాత‌ల వ‌ల్ల వాస్త‌వాలు ప్ర‌భుత్వానికి తెలియ‌క‌, పైపెచ్చు చెడ్డ పేరు వ‌చ్చేందుకు సాక్షి త‌న వంతు ప్ర‌య‌త్నాన్ని విజ‌య‌వంతంగా చేస్తోంద‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. క‌నీసం నిజాలు రాయ‌లేక‌పోయినా, అర‌కోటి బెడ్స్ లాంటి అస‌త్య క‌థ‌నాలు రాయ‌క‌పోవ‌డ‌మే జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి చేసే మేలు అని సాక్షి యాజ‌మాన్యం గుర్తించాల్సి వుంది. 

చంద్ర‌బాబుకు ఎల్లో మీడియా ఎలాగో, జ‌గ‌న్‌బాబుకు కూడా మీడియా రంగులో తేడా త‌ప్ప‌, క‌థ‌నాల్లో మాత్రం సేమ్ టు సేమ్ అని చెప్ప‌క త‌ప్ప‌దు.  ఇప్ప‌టికైనా లోటుపాట్ల‌ను ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌భుత్వానికి చేర‌వేస్తూ ఇటు కోవిడ్ రోగుల‌కు, అటు జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి మంచి చేసే క‌థ‌నాలు రాయాల్సిన బాధ్య‌త త‌న‌పై ఉంద‌ని సాక్షి గుర్తించాల్సిన అవ‌స‌రం ఉంది.

సొదుం ర‌మ‌ణ‌