ఆవేశంలో లాజిక్ మిస్ అవుతున్న అయ్యన్న?

సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మళ్లీ గొంతు చేస్తున్నారు. ఆయన జగన్ సర్కార్ మీద దారుణంగా విమర్శలు చేస్తున్నారు. సరే అవి ప్రజా సమస్యల మీద అనుకుంటే పొరపాటు. తమ పార్టీ నేతలను…

సీనియర్ నేత, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు మళ్లీ గొంతు చేస్తున్నారు. ఆయన జగన్ సర్కార్ మీద దారుణంగా విమర్శలు చేస్తున్నారు. సరే అవి ప్రజా సమస్యల మీద అనుకుంటే పొరపాటు. తమ పార్టీ నేతలను వరసబెట్టి అరెస్ట్ చేస్తున్నారు అని అయ్యన్నతెగ‌ ఇదైపోతున్నారు. 

టీడీపీ నేత‌ ధూళిపాళ్ళ నరేంద్రను అరెస్ట్ చేయడమేంటని కూడా నిందిస్తున్నారు. ఆయన కంపెనీ యాక్ట్ మీద సహకార సంస్థను మార్చడం తప్పు అయిపోయిందా అంటూ అయ్యన్న వైసీపీ సర్కార్ మీద ఆరోపణలు సంధిస్తున్నారు.

అయితే సంగం డైరీలో అక్రమాలు అవినీతి జరిగాయన్న దాని మీదనే ఏసీబీ అరెస్ట్ చేసింది తప్ప మరోటి కాదని వైసీపీ నేతలు కౌంటిస్తున్నారు. ఇక విశాఖ డైరీలో అవినీతి జరుగుతోందని అయ్యన్న ఇన్నాళ్ళకు కనిపెట్టారా అన్న సెటైర్లు కూడా పడుతున్నాయి.

విశాఖ డైరీ యాజమాన్యం గత నాలుగు దశాబ్దాలుగా ఏ పార్టీ వెంట నడిచిందో తమ్ముళ్లను అడిగితే చెబుతారు అంటున్నారు. నాడు తమ వైపు ఉంటే వారు ఉత్తములు, ఇపుడు వైసీపీలోకి వెళ్లారు కాబట్టి అవినీతి చేశారు అంటూ అయ్యన్న కామెంట్స్ చేయడం కూడా ఫక్త్ రాజకీయమే అంటున్నారు.

ఇదిలా ఉంటే ఏసీబీ, సీఐడీ సంస్థలు స్వతంత్రమైనవి అని అయ్యన్న భాష్యం చెప్పడాన్ని కూడా తప్పు పడుతున్నారు. అవి ప్రభుత్వంలో భాగమని మంత్రిగా పనిచేసిన అయ్యన్నకు తెలియదా అని కూడా అంటున్నారు. మరి  చంద్రబాబు మాకూ ఏసీబీ ఉంది. 

సీఐడీ ఉంది అంటూ గట్టిగా గర్జించిన నాడు అధికార దుర్వినియోగం అన్న సంగతి అయ్యన్నకు తట్టలేదా అంటూ కౌంటర్లు పడుతున్నాయి. మొత్తానికి తప్పుంటేనే ఎవరినైనా అరెస్ట్ చేస్తారు. కేసు పెట్టారు అంటే ఆధారాలు కూడా ఉండబట్టే కదా ఈ చిన్న విషయం తెలియక రాజకీయ కక్ష అంటూ రంకెలు వేయడం తమ్ముళ్లకు అలావాటు అయిపోయింది అంటున్నారు వైసీపీ నేతలు.