కడుపు మీద కొడితే ఓకే.. నా జీవితం మీద కొట్టారు

చాన్నాళ్ల తర్వాత మళ్లీ తెరపైకొచ్చారు నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారంటూ బయటకొచ్చిన ఆడియో టేపుల కారణంగా ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని పోగొట్టుకున్న ఈయన మరోసారి ఆ ఘటనపై…

చాన్నాళ్ల తర్వాత మళ్లీ తెరపైకొచ్చారు నటుడు 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృధ్వి. ఓ మహిళతో అసభ్యంగా ప్రవర్తించారంటూ బయటకొచ్చిన ఆడియో టేపుల కారణంగా ఎస్వీబీసీ ఛైర్మన్ పదవిని పోగొట్టుకున్న ఈయన మరోసారి ఆ ఘటనపై స్పందించారు. వైసీపీలో కొంతమంది కావాలనే తనపై కుట్ర చేశారని, తనను తప్పించి పైశాచిన ఆనందం పొందుతున్నారని ఆరోపించారు.

“పనిచేయమని చెప్పినందుకు, అవసరమైతే జగన్ కాళ్లు పట్టుకొని ఉద్యోగాలు పర్మినెంట్ చేస్తానని అన్నందుకు నాపై కక్ష కట్టారు. ఈ 5 నెలల్లో 50 ఏళ్ల జీవితాన్ని నాకు చూపించారు కొందరు వైసీపీ వాళ్లు. అర్హత లేదు తప్పుకోమని చెబితే గౌరవంగా వెళ్లిపోయేవాడ్ని. కానీ 5 నెలల వ్యవథిలో నన్ను భ్రష్టుపట్టించారు. నన్ను పంపించేశామని చెప్పి కొందరు పార్టీలు చేసుకున్నారు, పైశాచిక ఆనందం పొందారు. కడుపు మీద కొడితే బాధపడేవాడ్ని కాదు, నా జీవితం మీద కొట్టారు.”

తనను ఎవరూ రాజీనామా చేయమని అడగలేదన్నారు పృధ్వి. కేవలం ముఖ్యమంత్రి జగన్ పై గౌరవంతో తనకుతానుగా స్వచ్ఛందంగా తప్పుకున్నానని, ఇప్పటికీ ఎప్పటికీ తను పార్టీలో కార్యకర్తలా పనిచేస్తానని, తనపై కుట్ర చేసిన వ్యక్తుల పేర్లు త్వరలోనే బయటపెడతానని అన్నారు.

“ముఖ్యమంత్రి గారి మీద గౌరవంతో నాకు నేనుగా రాజీనామా చేశాను. రాజకీయంగా ఎదుర్కోలేక కొందరు నా మీద కుట్ర పన్నారు. సినిమాల్లో రేప్ చేసి హీరోయిన్ ను ఎలా వదిలేస్తారో అలా నన్ను గాలికి వదిలేశారు. నా చుట్టుపక్కల, నా పక్కనే ఉండి నాకు వెన్నుపోటు పొడిచారు. త్వరలోనే అందరి పేర్లు బయటపెడతా.”

లౌక్యం సినిమాలో తను నటించాను కానీ జీవితానికి పనికొచ్చే లౌక్యం మాత్రం నేర్చుకోలేకపోయానని అన్న పృధ్వి… ప్రస్తుతం తను సినిమాలతో బిజీగా ఉన్నానని, 2024 వరకు తనకు సినిమాలున్నాయని స్పష్టంచేశారు. చిరంజీవి-కొరటాల సినిమాలో కూడా తను నటిస్తున్నట్టు తెలిపాడు.

సంక్షేమ పథకాలు రాష్ట్రానికి క్షేమమేనా?