గత ప్రభుత్వ హయాంలో అవినీతిని వెలికి తీసేందుకు సిట్ ను ఏర్పాటుచేసిన ముఖ్యమంత్రి, ఇప్పుడు దానికి విశేష అధికారులు కల్పించారు. ముఖ్యమంత్రి తాజా ఆదేశాల ప్రకారం.. రాష్ట్రం మొత్తం ఇప్పుడు సిట్ విచారణ పరిథిలోకి వచ్చింది. అంటే.. రాష్ట్రంలో ఏ మూలకైనా వెళ్లి విచారించే అధికారం సిట్ కు వచ్చిందన్నమాట. ఈ మేరకు ప్రభుత్వం ఆర్డర్ జారీ చేసింది.
ఇదొక్కటే కాదు, సిట్ తనకుతానుగా ఓ పోలీస్ స్టేషన్ గా వ్యవహరించే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కట్టబెట్టింది. ఏదైనా అరెస్ట్ చేయాల్సి వస్తే స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్ ను సిట్ సంప్రదించాల్సిన అవసరం లేదు. తనకుతానుగా అరెస్టులు చేయొచ్చు. రాష్ట్రంలో ఎక్కడైనా అనుమానితుల్ని నిర్బంధంలోకి తీసుకోవచ్చు.
రాష్ట్రంలో ఎవరినైనా పిలిచి విచారించే అధికారాన్ని ఇప్పటికే సిట్ కు కట్టబెట్టిన ప్రభుత్వం, ఇప్పుడు దానికి విశేష అధికారాలు కల్పించింది. తాజా ప్రభుత్వ ఉత్తర్వులతో సిట్ మరింత బలోపేతమైంది. మరింత స్వతంత్రంగా పనిచేసే అవకాశం వచ్చింది. అమరావతి భూముల అవకతవకలు, ఇన్ సైడర్ ట్రేడింగ్ పై దృష్టి సారించబోతున్న సిట్.. ఇతర ప్రాజెక్టుల్లోని అక్రమాలు-అవినీతిపై కూడా దృష్టి సారించబోతోంది.
మొత్తంగా మంత్రివర్గ ఉపసంఘం ఇచ్చిన నివేదికలోని ప్రతి అంశాన్ని సిట్ టచ్ చేయబోతోంది. 10 మంది సభ్యులతో కూడిన ఈ బృందానికి కొల్లి రఘురామ్ రెడ్డి నేతృత్వం వహిస్తారు.