జగన్ సర్కార్‌కు ఆ అధికారి ‘జాస్తి’ మింగుడు పడటం లేదు. ఎలాగైనా అవినీతి కేసులో ఇరికించాలని జగన్ సర్కార్ చేసిన ప్రయత్నం ఫలించడం లేదు. అమరావతి దాటకుండా కట్టడి చేయాలనుకున్న సర్కార్ ప్రయత్నాలను ‘క్యాట్’ రూపంలో అడ్డుకొంది. జగన్ సర్కార్‌కు మింగుడు పడని ఆ అధికారే జాస్తి కృష్ణకిషోర్. ఐఆర్‌ఎస్ అధికారి జాస్తి కృష్ణకిషోర్ సస్పెన్షన్‌ను క్యాట్ మంగళవారం రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది.
అంతేకాదు తిరిగి కేంద్ర సర్వీస్‌లకు వెళ్లేందుకు అతనికి అనుమతిస్తూ కేంద్ర పరిపాలన ట్రిబ్యునల్ ఉత్తర్వులిచ్చింది. అయితే అతనిపై కేసులను ప్రభుత్వం చట్టప్రకారం విచారించుకోవచ్చని క్యాట్ పేర్కొంది.
గత ప్రభుత్వంలో ఏపీ ఆర్థిక అభివృద్ధి మండలి సీఈవోగా పనిచేసిన కృష్ణ కిషోర్‌పై అవినీతి ఆరోపణలు రావడంతో జగన్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పరిశ్రమలు, మౌలిక వసతులశాఖ నుంచి నివేదికలు తెప్పించుకున్న జగన్ సర్కార్, ఆయన హయాంలో జరిగిన అక్రమాలపై కేసు నమోదు చేసి విచారణ జరపాలని సీఐడీ, ఏసీబీ డీజీలను ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిధుల దుర్వినియోగం సహా ప్రభుత్వ అనుమతి లేకుండా రూ.కోట్ల విలువైన ప్రకటనలు జారీ చేశారన్న అభియోగాలపై కేసు నమోదైంది.
కృష్ణకిషోర్‌పై ఆరు నెలల్లో విచారణ పూర్తి చేయాలని, అంత వరకు అతను అమరావతి వదిలి పెట్టకూడదని ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తనను సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఆయన క్యాట్‌ను ఆశ్రయించాడు. విచారణ చేపట్టిన క్యాట్ కృష్ణ కిషోర్ సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ ఉత్తర్వులిచ్చింది. దీంతో జగన్ సర్కార్‌కు క్యాట్‌లో చుక్కెదురైంది.