మొన్న బంగారు నాణేలు.. ఈసారి 5 రూపాయల నోట్లు

మోసపోయేవాడు ఉండాలే కానీ ఈ కాలంలో మోసం చేయడం చాలా తేలిక. ఇలా మోసాలు చేసే వాళ్లందరికీ ప్రజల అత్యాశే పెట్టుబడి. మొన్నటికిమొన్న తెలంగాణలో బంగారు నాణేలు, లంకె బిందెల పేరిట జరిగిన మోసాలు…

మోసపోయేవాడు ఉండాలే కానీ ఈ కాలంలో మోసం చేయడం చాలా తేలిక. ఇలా మోసాలు చేసే వాళ్లందరికీ ప్రజల అత్యాశే పెట్టుబడి. మొన్నటికిమొన్న తెలంగాణలో బంగారు నాణేలు, లంకె బిందెల పేరిట జరిగిన మోసాలు చూశాం. ఇప్పుడు ఇదే తెలంగాణలో 5 రూపాయల నోట్లు పేరిట మరో మోసం వెలుగుచూసింది. చెప్పుకోడానికి సరదాగా ఉంటుంది కానీ లక్షల్లో డబ్బు పోయింది.

నిజామాబాద్ జిల్లా కామారెడ్డి మండలానికి చెందిన నర్సింహులుకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. అట్నుంచి వ్యక్తి ఒకటే ప్రశ్న అడిగాడు. మీ దగ్గర పాత 5 రూపాయల నోటు ఉందా? దానిపై ట్రాక్టర్ దున్నుతున్న గుర్తు ఉందా? ఉంటే మీరే లక్షాధికారి. వెంటనే నోటు ఇచ్చి డబ్బు తీసుకెళ్లండి.

ఫోన్ కాల్ కట్టవ్వగానే నర్సింహులుకు ఆశ పుట్టింది. వెదికితే ఇంట్లో 5 రూపాయల నోటు ఉంది. ఇంకేముంది, ఎగిరి గంతేశాడు. అగంతకుడు మళ్లీ ఫోన్ చేశాడు. 11 లక్షల 74వేలు రూపాయలు ఇవ్వాలంటే ముందుగా ఎకౌంట్ ఓపెన్ చేయాలి, ఎన్ఓసీ సర్టిఫికెట్ కావాలి, ఐటీ క్లియరెన్స్ కావాలంటూ మాట్లాడాడు. వాటికి కొంత ఖర్చు అవుతుందని నమ్మబలికాడు.

అజ్ఞాతవాసి చెప్పిన మాటలు నమ్మి పది సార్లు డబ్బులు కట్టాడు నర్సింహులు. మొత్తం లెక్క తేలిస్తే 8 లక్షల 35వేల రూపాయలు అయింది. అప్పటికీ ఇంకా ఫోన్ చేసి డబ్బులు కావాలని అడుగుతూనే ఉన్నాడు అవతలి వ్యక్తి. అప్పుడుకానీ మనోడికి అనుమానం రాలేదు. వెంటనే వెళ్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు కాసేపు నవ్వుకున్నారు. ఆ తర్వాత కేసు ఫైల్ చేశారు. సదరు వ్యక్తి పశ్చిమ బెంగాల్ నుంచి కాల్ చేస్తున్నట్టు గుర్తించారు. బంపర్ ఆఫర్, బహుమతుల పేరిట ఎవరైనా కాల్ చేస్తే అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నారు పోలీసులు.