'జోహార్ హరికృష్ణ.. జోహార్ హరికృష్ణ.. జోహార్ హరికృష్ణ..' అంటూ నినదించేశాడు నందమూరి బాలకృష్ణ నిన్న జరిగిన 'అరవింద సమేత' సినిమా సక్సెస్ ఈవెంట్‌లో. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన 'అరవింద సమేత' సినిమా ఘనవిజయం సాధించిందని చెబుతూ, తాము తప్ప ఇంకెవరూ ఇలాంటి సినిమాలు చేయలేరని తనదైన స్టయిల్లో ప్రసంగిస్తూ అభిమానుల్లో బాలయ్య ఉత్సాహం నింపేశాడు.
అంతా బాగానే వుందిగానీ, హరికృష్ణ విషయంలో నందమూరి బాలకృష్ణ 'జోహార్ నినాదాలు' ఎంతవరకు సబబు.? ఆ నినాదాలు సోదరుడు హరికృష్ణపై అమితమైన ప్రేమాభిమానాలతో బాలయ్య గుండెల్లోంచే వచ్చాయా.? అన్న అనుమానాలు సాక్షాత్తూ నందమూరి అభిమానుల్లోనే వ్యక్తమవుతున్నాయి. అందుకు కారణమూ లేకపోలేదు.. టీడీపీలో హరికృష్ణని చంద్రబాబు ఎలా అవమానించిందీ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అప్పుడెప్పుడూ బాలయ్య, తన బావ చంద్రబాబుతో హరికృష్ణ విషయమై మాట్లాడింది లేదు.. పార్టీలో నందమూరి నారా కుటుంబ సభ్యుల మధ్య విభేదాల్ని చల్లార్చే ప్రయత్నం చేసిందీ లేదు. తాను, తన బావ, తన మేనల్లుడు (ఇంటల్లుడు కూడా..) తప్ప, తెలుగుదేశం పార్టీకి ఇంకొకరు అవసరం లేదనుకుని, తెలుగుదేశం పార్టీ నుంచి నందమూరి కుటుంబంలో చాలామందిని దూరం పెట్టిన బాలయ్య.. ఇప్పుడు సినీ వేదికలపై 'జై ఎన్టీఆర్' నినాదాలతోపాటు, 'జోహార్ హరికృష్ణ' నినాదాలు చేయడం ఆశ్చర్యకరమే మరి.
రాజ్యసభ సీటుని ఇంకోసారి హరికృష్ణ ఆశిస్తే, అది నేరమా.? ఆ విషయంలో హరికృష్ణ మనోవేదన అంతా ఇంతా కాదు. అయినా, తన తండ్రి స్వర్గీయ నందమూరి తారకరామావుని రాజకీయంగా చంద్రబాబు వెన్నుపోటు పొడిచినా, 'బావే బెస్ట్..' అంటోన్న బాలయ్య, హరికృష్ణ విషయంలో చంద్రబాబు అన్యాయం చేస్తే మాత్రం.. పట్టించుకుంటారని ఎలా అనుకోగలం.?
పైగా ఇప్పుడు బాలయ్య 'ఎన్‌టిఆర్ బయోపిక్' తీసేస్తున్నారాయె.. అదీ బావ చంద్రబాబుకి రాజకీయంగా లబ్ది చేకూర్చేందుకు. సో, ఈ క్రమంలో బాలయ్య 'హరికృష్ణకి జోహార్' అనడం కూడా ఓ పబ్లిసిటీ స్టంట్‌లానే భావించాలేమో.