డివివి దానయ్య నిర్మిస్తున్న రామ్ చరణ్ – బోయపాటి సినిమా అనుకున్నట్లుగా జనవరి 11కు వస్తుందా? ఈ సినిమా రాకుండా చేయడానికి తెరచాటు వెన్నుపోటు యత్నాలు జరుగుతున్నాయా? ఇవే గుసగుసలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి. పేరు వెల్లడించడానికి ఇష్టపడని యూనిట్ సభ్యులు, అలాగే ఫ్యాన్స్ వర్గాలు కూడా ఈ సినిమా నిర్మాణం జరుగుతున్న తీరుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
డైరక్టర్ బోయపాటి కావాలని సినిమాను నత్తనడక నడుపుతున్నారని విమర్శలు చేస్తున్నారు. వందరోజుల్లో పూర్తి కావాల్సిన సినిమా ఆ రోజులుఅన్నీ దాటిపోయినా, ఇంకా ముఫై మూడురోజుల వర్క్ బకాయి వుండడం పట్ల మెగాచీ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
పైగా ఈ సినిమా పూర్తి కాకుండా, మధ్యలో రామ్ చరణ్ 10 నుంచి పన్నెండు రోజులు ఆర్ ఆర్ ఆర్ సినిమా సెట్ మీదకు వెళ్లిపోతున్నారు. అంటే అదో పన్నెండు రోజలు కలపాలి. ఇంక మధ్యలో ఏర్పాట్లు, పోస్ట్ ప్రొడక్షన్ అన్నీ వుండనే వున్నాయి.
సహజంగా బాలయ్యకు వీరాభిమాని, తరువాత సినిమా ఆయనతోనే చేస్తున్న దర్శకుడు బోయపాటి కావాలనే ఈ సినిమాను నత్త నడక నడిపిస్తున్నారేమో అని అనుమానాలు ఇండస్ట్రీ సర్కిళ్లలో, మెగాభిమానుల సర్కిళ్లలో వినిపిస్తున్నాయి. ఈ అనుమానాలు బలపర్చేలా మరో ఉదాహరణ కూడా చెబుతున్నారు.
ఈ సినిమా పాటలు ఇప్పటి వరకు రెడీ కాలేదట. బోయపాటి వెళ్లి, దేవీ దగ్గర పాటలు చేయించి తెచ్చుకోవాలి. ఇఫ్పటికి ఒక్కపాట మాత్రమే తెచ్చుకున్నట్లు తెలుస్తోంది. మిగిలిన ట్యూన్ లు తెప్పించుకుని, సాహిత్యం రాయించుకుని, రికార్డింగ్ చేయించుకోవాలి. పైగా ఆ పాటల షూటింగ్ సరేసరి.
జనవరి 9న ఎన్టీఆర్ బయోపిక్ విడదులవుతుంది. 11న రామ్ చరణ్ సినిమా విడుదల. సహజంగానే ఇది కాస్త ఇబ్బందికర పరిణామం. ముఖ్యంగా దర్శకుడు బోయపాటికి. అందుకే మెలమెల్లగా రామ్ చరణ్ సినిమాను వెనక్కు నెట్టే ప్రయత్నాలు స్మూత్ గా జరుగుతున్నాయేమో అని మెగాభినాలు ఆందోళన వ్యక్తం చేస్తుంటే, సినిమా యూనిట్ సభ్యులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.