బాలయ్య Vs వర్మ: ఎన్నికల బరిలో బయోపిక్స్

రామ్ గోపాల్ వర్మ మూర్ఖుడా?, మేథావా?, సరుకు అయిపోయిందా..? అనే విషయాలను పక్కనపెడితే వర్మ ఓ టిపికల్ క్యారెక్టర్ అనే విషయం మాత్రం స్పష్టంగా సినీజనాలందరికీ తెలుసు. సైకిల్ దూరే సందిస్తే.. ఏకంగా బస్సునే…

రామ్ గోపాల్ వర్మ మూర్ఖుడా?, మేథావా?, సరుకు అయిపోయిందా..? అనే విషయాలను పక్కనపెడితే వర్మ ఓ టిపికల్ క్యారెక్టర్ అనే విషయం మాత్రం స్పష్టంగా సినీజనాలందరికీ తెలుసు. సైకిల్ దూరే సందిస్తే.. ఏకంగా బస్సునే ఆ గ్యాప్ లో తీసుకెళ్లి పార్కింగ్ చేసే కెపాసిటీ వర్మకి ఉంది. తాజాగా ఎన్టీఆర్ బయోపిక్ వార్ విషయంలో ఇది మరోసారి రుజువవుతోంది.

ఎంతో కష్టపడి మేకప్ సెట్ చేసుకుని, గ్రాఫిక్ తో కవర్ చేసుకుని, బాబుగారి క్యారెక్టర్ కోసం డైటింగ్ లు చేయించి.. అమ్మగారి పాత్రకు బాలీవుడ్ టాప్ హీరోయిన్ ని ఒప్పించి, ఎన్నికల టైమ్ కి ఏదో మాయ చేద్దామనుకుంటున్న తరుణంలో ఎన్టీఆర్ బయోపిక్ పై ఉరుములేని పిడుగులా వచ్చిపడ్డాడు రామ్ గోపాల్ వర్మ.

ఎన్టీఆర్ బయోపిక్ అనౌన్స్ మెంట్ టైమ్ లోనే పోటీగా లక్ష్మీస్ ఎన్టీఆర్ అని ఫస్ట్ లుక్ రిలీజ్ చేసి మరీ దెబ్బకొట్టిన వర్మ, ఇప్పుడు స్పీడ్ పెంచాడు. సరిగ్గా బాలయ్య నటిస్తున్న బయోపిక్ రెండోపార్ట్ రిలీజ్ రోజే తన సినిమా విడుదలకు ముహూర్తం పెట్టేసి శ్రీవారి సాక్షిగా కసిగా కవ్వించాడు.

అదే డేట్ ఎందుకంటే “మా సినిమా నిర్మాత కొడుకు పుట్టినరోజుంది మీకెందుకు” అంటూ లాజిక్ కి అందని ఆన్సరిచ్చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ బయోపిక్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి సోదరుడు కల్యాణి మాలిక్ ని తన సినిమా మ్యూజిక్ డైరక్టర్ గా పరిచయం చేస్తూ మరో బాంబ్ పేల్చాడు.

లక్ష్మీస్ ఎన్టీఆర్ కి వైసీపీ నేతలు నిర్మాతలుగా పనిచేయడం దగ్గర్నుంచి, రిలీజ్ డేట్, మ్యూజిక్ డైరెక్టర్.. ఇలా అడుగడుగునా పోటీ పెట్టుకుంటూపోతే, చివరకు బాలయ్య చేతిలో వర్మకు సీరియస్ వార్నింగ్ పడే అవకాశం ఉందని సినీ జనాలు అనుకుంటున్నారు.

అసలే తండ్రి జీవిత చరిత్ర. దాన్ని గొప్పగా తీయకపోయినా, కనీసం ఎన్నికల కోసం వాడుకోవాలనేది బాలయ్య ప్రయత్నం. అందుకే దర్శకుడ్ని సైతం తప్పించారు. ఇప్పుడు లక్ష్మీస్ ఎన్టీఆర్ ని తెరపైకి తెచ్చి, ఎన్టీఆర్ బయోపిక్ ని పలుచన చేయాలని చూస్తే బాలయ్య ఊరుకుంటాడా? వర్మ మాటల తూటాలతో రెచ్చగొడితే బాలయ్య తగ్గుతాడా..?

అసలే బాలయ్యకు తూటాలు పేల్చిన చరిత్ర ఉంది. పోనీ ఒక్కసారి చరిత్ర తిరగేసుకో అని బాలయ్య డైలాగ్ కొడితే వర్మ జంకే రకమా అంటే అదీకాదు. మరి ఈ బయోపిక్ బాక్సాఫీస్ వార్ కి అంతం ఎక్కడో వారికే తెలియాలి. 2019 జనవరి 24తో ఈ బయోపిక్ ల బాక్సాఫీస్ వార్ ముగుస్తుంది.

కానీ అసలు కథ అక్కడ్నుంచే మొదలవుతుంది. ఆర్జీవీ ఎన్టీఆరా, బాలయ్య ఎన్టీఆరా.. ఎన్నికల టైమ్ కు ఏ బయోపిక్ ఎక్కువ మైలేజీ తీసుకొస్తుందో చూడాలి. 

గ్రేట్ ఆంధ్ర వీక్లీ పేపర్ కోసం క్లిక్ చేయండి