వైసీపీకి ప్రత్యామ్నాయం టీడీపీయేనా ?

టీడీపీ పరిస్థితి తెలంగాణలో, ఆంధ్రాలోనూ బాగా లేదు. తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైంది. తెలంగాణా ప్రజలు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎంచుకోవాల్సి వస్తే కాంగ్రెస్ ను గానీ బీజేపీని గానీ ఎంచుకుంటారు. ఇక్కడి…

టీడీపీ పరిస్థితి తెలంగాణలో, ఆంధ్రాలోనూ బాగా లేదు. తెలంగాణలో ఆ పార్టీ పూర్తిగా కనుమరుగైంది. తెలంగాణా ప్రజలు టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం ఎంచుకోవాల్సి వస్తే కాంగ్రెస్ ను గానీ బీజేపీని గానీ ఎంచుకుంటారు. ఇక్కడి ప్రజలు టీడీపీని లెక్కలోకి తీసుకోవడంలేదు. కానీ ఏపీలో అధికార వైసీపీకి టీడీపీయే ప్రత్యామ్నాయమని వైసీపీ నాయకులు భావిస్తున్నారు.

నిజానికి 2019 ఎన్నికల తరువాత ఏపీలో టీడీపీ దారుణంగా దెబ్బతిన్నది. వైసీపీని ఎదుర్కొనే శక్తి టీడీపీకి సన్నగిల్లిపోయింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ ముందు నిలబడలేకపోయింది. ఇక తిరుపతి ఉప ఎన్నికలో టీడీపీ విజేత అవుతుందా? వైసీపీ విజయం సాధిస్తుందా ? వేచి చూడాల్సిందే.

ఇదిలాఉంటే వైసీపీలో కొందరు అసంతృప్త నాయకులు పార్టీ ఫిరాయించాల్సివస్తే అందుకు టీడీపీనే ఎంచుకోవాలని ఆలోచిస్తున్నారట. తమకు ప్రత్యామ్నాయం పచ్చ పార్టీయే అంటున్నారట. వైసీపీలోని అసంతృప్తవాదుల్లో టీడీపీ మాజీ నాయకులు కొందరున్నారు. వివిధ కారణాలతో వీరు వైసీపీలో అసంతృప్తిగా ఉన్నారు. వారు వైసీపీలో చేరినప్పటినుంచి యేవో కారణాలతో పార్టీలో ప్రాధాన్యం దక్కలేదు. ఇప్పటివరకు ఏ పదవులూ రాలేదు.

వచ్చే ఎన్నికల నాటికి కూడా వైసీపీ నాయకత్వం తమను పట్టించుకోకపోతే, ఒకవేళ ఎన్నికల్లో టిక్కెట్లు కూడా ఇవ్వకపోతే తమకు ప్రత్యామ్నాయం టీడీపీయే అంటున్నారట. బీజేపీ, జనసేనలో చేరడానికి సుముఖంగా లేరట. ఒక పార్టీగా జనసేన పటిష్టంగా లేదనే అభిప్రాయముంది. ఇక ఏపీకి అన్యాయం చేసిన పార్టీగా బీజేపీ పట్ల ప్రజలు విముఖంగా ఉన్నారు. అందులోనూ ప్రస్తుత కోవిడ్ సంక్షోభంలో ప్రధాని మోడీ వ్యవహారశైలిపై జాతీయ స్థాయిలో వ్యతిరేకత కనబడుతోంది.

దేశంలో కోవిడ్ ను నియంత్రించలేకపోవడం, సుప్రీం కోర్టు కూడా కేంద్రంపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం… ఇదంతా వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపిస్తుందని అనుకుంటున్నారు. అయిదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తేగానీ వచ్చే ఎన్నికల్లో బీజేపీకి భవిష్యత్తు ఉంటుందా, ఉండదా అనేదానిపై కొంతమేరకు క్లారిటీ వస్తుంది. జనసేనకు బీజేపీతో పొత్తు ఉంది కాబట్టి వైసీపీ అసంతృప్తవాదులు ఆ పార్టీవైపు చూడకపోవచ్చు. కాబట్టి అసంతృప్తవాదులకు కనబడే ఆల్టర్ నేటివ్ టీడీపీ మాత్రమే. 

ఇప్పటికే జగన్ ను నమ్ముకుని అనేక మంది నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. ఎమ్మెల్సీ పదవులు, నామినేటెడ్ పదవుల కోసం వెయిట్ చేస్తున్నారు. కానీ రెండేళ్లవుతున్నా జగన్ కొందరు ముఖ్యమైన నేతలకు ఎలాంటి పదవులు ఇవ్వకుండా పక్కన పెట్టేశారు. వీరంతా త్వరలో ఖాళీ అయ్యే 18 ఎమ్మెల్సీ స్థానాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈసారైనా తమకు చోటు దక్కుతుందన్న ఆశతో ఉన్నారు. 

కానీ ఆ ఆశలు నెరవేరకపోతే మాత్రం తమ దారి తాము చూసుకుంటారు. ఇక 2024 అసెంబ్లీ ఎన్నికల గురించి కూడా నాయకులు ఇప్పటినుంచే ఆలోచిస్తున్నారు. మరోసారి కష్టపడినా జగన్ టిక్కెట్ ఇస్తారన్న గ్యారంటీ ఉండదని కొందరు నాయకులు అభిప్రాయపడుతున్నారు. 

గతంలో టీడీపీ అధినేత చంద్రబాబుతో విభేదించి వైసీపీలో చేరిన పలువురు నాయకులు ఇప్పుడున్న పరిస్థితిలో బాబు ఆదరిస్తాడని నమ్ముతున్నారు. గతంలో వైసీపీ టిక్కెట్ ఆశించి రానివారు సైతం రానున్న ఆరు నెలల కాలంలో వైసీపీని వీడే అవకాశాలున్నాయని చెబుతున్నారు. టీడీపీ జాతకం ఎలా ఉంటుందో మరి.