కరోనా సెకెండ్ వేవ్.. ఏ మాస్క్ వాడితే మంచిది?

ఒకసారి కరోనా వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడు సెకెండ్ వేవ్ గట్టిగా తాకింది. అయినప్పటికీ ఇంకా చాలామందికి ఎలాంటి మాస్క్ వాడాలన్నది పెద్ద అనుమానం. చాలామంది రోడ్డుపై దొరికే క్లాత్ మాస్క్ తోనే పని కానిచ్చేస్తున్నారు.…

ఒకసారి కరోనా వచ్చి వెళ్లిపోయింది. ఇప్పుడు సెకెండ్ వేవ్ గట్టిగా తాకింది. అయినప్పటికీ ఇంకా చాలామందికి ఎలాంటి మాస్క్ వాడాలన్నది పెద్ద అనుమానం. చాలామంది రోడ్డుపై దొరికే క్లాత్ మాస్క్ తోనే పని కానిచ్చేస్తున్నారు. ''ఏదో ఒకటి పెట్టుకుంటే పోలా'' అన్నట్టు వ్యవహరిస్తున్నారు. మరికొంతమంది జరిమానాలకు భయపడి చీప్ గా దొరికితే నామ్ కే వాస్తే ముఖానికి తగిలిస్తున్నారు.

కానీ ఇది సెకెండ్ వేవ్. ప్రాధమికంగా మనల్ని కాపాడేది మాస్క్ మాత్రమే. మాస్క్ విషయంలో ఏమాత్రం అశ్రద్ధగా ఉన్నా కరోనా కబలించడం ఖాయం. అందుకే మంచి మాస్క్ వాడాలని సూచిస్తున్నారు వైద్యులు. మరీ ముఖ్యంగా సెకండ్ వేవ్ లో డబుల్ మాస్క్ (మాస్క్ పై మాస్క్) పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

ఎన్-95 రకానికి చెందిన మాస్క్ అయితే ఒక్కటి సరిపోతుంది. అదే రెగ్యులర్ సర్జికల్ మాస్కులైతే మాత్రం 2 పెట్టుకోమంటున్నారు. క్లాత్ మాస్కులు వాడేవారు, దాంతోపాటు సర్జికల్ మాస్క్ ను కూడా పెట్టుకోవాలని సూచిస్తున్నారు.

మాస్కులపై ఉన్న అపోహల్ని తొలిగించేలా కేంద్ర ప్రభుత్వం ఓ జాబితాను విడుదల చేసింది. ఏ మాస్క్ ఏ మేరకు పనితీరు కనబరుస్తుందో అందులో వివరంగా చెప్పింది. గుడ్డతో చేసిన మాస్కులు 50శాతం మాత్రమే పనికొస్తాయని, అదే ఎన్-95 రకానికి చెందిన మాస్కులైతే సమర్థంగా పనిచేస్తాయని చెబుతోంది. ఈ రకానికి చెందిన మాస్కులు బాక్టీరియా, డస్త్, ఇతర రకాల రేణువుల్ని వందశాతం అడ్డుకుంటాయని.. వైరస్ ను 95శాతం నియంత్రిస్తాయని చెబుతున్నారు.

ఎన్-99, డబ్ల్యూ-95, ఎఫ్ఎఫ్ పీ-1, రకాలకు చెందిన మాస్కులు కూడా బాగా పనిచేస్తాయని చెబుతున్నారు. రోడ్డుపై దొరికే క్లాత్ మాస్కులు, ఫ్యాషన్ కోసం వాడే స్పాంజ్ మాస్కులు మాత్రం ఈ టైమ్ లో అత్యంత ప్రమాదకరమని చెబుతున్నారు. స్పాంజ్ మాస్కులు, గుడ్డతో చేసిసన మాస్కులు వైరస్ ను ఒక్క శాతం కూడా అపలేవని తేల్చారు.