ఈమధ్య ఇదొక పెద్ద సందేహంగా మారింది. చాలామంది కరోనా బారిన పడి కోలుకుంటున్నారు. మరి అలా కోలుకున్న వాళ్లు వెంటనే వ్యాక్సిన్ తీసుకోవచ్చా? దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు, స్టడీలు బయటకురాలేదు. కాకపోతే కొన్ని సూచనలు మాత్రం అందుబాటులోకి వచ్చాయి.
కరోనా నుంచి కోలుకున్న వ్యక్తిలో యాంటీబాడీస్ పుష్కలంగా ఉంటాయి. అలాంటి వారు ప్రస్తుతానికి వ్యాక్సిన్ తీసుకోనక్కర్లేదు. తాజాగా కేంద్రం చెప్పిన సూచనల ప్రకారం చూసుకుంటే… కరోనా నుంచి కోలుకున్న ఓ వ్యక్తికి 4 నుంచి 8 వారాల వరకు టీకా అవసరం ఉండదు.
అయితే ఈ రూల్ అందరికీ సమానంగా వర్తించదు. కొంతమందిలో యాంటీబాడీస్ 8 వారాల వరకు అలానే నిలిచి ఉంటాయి. మరికొంతమందికి కరోనా తగ్గిన 4 వారాలకే, అంటే నెల రోజులకే ఒంట్లో యాంటీబాడీస్ కూడా తగ్గిపోతాయి. కాబట్టి భారతీయ వైద్య నిపుణులు జనరలైజ్ చేసి చెబుతున్నదేంటంటే.. కరోనా నుంచి కోలుకున్న వ్యక్తి కనీసం 2 నెలల వరకు జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత వ్యాక్సిన్ వేసుకోవాలి.
ఇక అంతర్జాతీయ మార్గదర్శకాల విషయానికొస్తే.. అమెరికాకు చెందిన వ్యాధుల నియంత్రణ-నివారణ సంస్థ 90 రోజుల లాక్-ఇన్ పీరియడ్ చెబుతోంది. కరోనా నుంచి కోలుకున్న 90 రోజుల్లోపు (3 నెలలు) వ్యాక్సిన్ అవసరం లేదనేది దీని వాదన. అటు ప్రపంచ ఆరోగ్య సంస్థ మాత్రం 180 రోజులు (6 నెలలు) పాటు వ్యాక్సిన్ అవసరం ఉండదని చెబుతోంది.
కాబట్టి ఈ విషయంలో ఏకీకృత మార్గదర్శకాలేం లేవు. భారతీయ వైద్య నిపుణులు చెబుతున్నట్టు 2 నెలల పాటు కాస్త జాగ్రత్తగా ఉండి.. ఆ వెంటనే వ్యాక్సిన్ వేయించుకోవడం ఉత్తమం. ఈ 2 నెలలు జంక్ ఫుడ్ కు, మద్యానికి దూరంగా ఉండమని చెబుతున్నారు. దీనికి కూడా శాస్త్రీయ ఆధారాల్లేవు. కేవలం సూచన మాత్రమే.